US Winter Storm: అగ్రరాజ్యం అమెరికా (America) తీవ్ర మంచు తుపాను (US Winter Storm) గుప్పిట్లో చిక్కుకుంది. దేశంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. ఆదివారం నాడు ఈ పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. అమెరికాలోని ప్రధాన ప్రాంతాలన్నింటిపైనా ఈ ప్రభావం కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తు మంచు కూరుకుపోయింది. ఈ ప్రభావంతో పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. విద్యుత్ సరఫరాలో కూడా తీవ్ర అంతరాయం కలిగింది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. రోడ్లన్నీ మంచుతో నిండిపోయి ప్రమాదకరంగా మారిపోయాయి. రానున్న మరికొన్ని రోజుల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని, తీవ్ర అంతరాయాలు తప్పదని వాతావరణ అమెరికా వాతావరణ నిపుణులు అప్రమత్తం చేశారు.
18 కోట్ల మందిపై తుపాను ప్రభావం
మంచు తుపాను అమెరికా ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. దక్షిణ రాకీ పర్వతాల నుంచి న్యూఇంగ్లాండ్ వరకు తుపాను విస్తరించిందని, సుమారుగా 18 కోట్ల మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ (NWS) అప్రమత్తం చేసింది. తీవ్రమైన మంచు, గడ్డకట్టే పరిస్థితుల్లో రికవరీ చర్యలు కూడా సాధ్యపడడం లేదు. దీంతో, చాలా నెమ్మదిగా మంచు తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఉష్ణోగ్రత దారుణంగా పడిపోవడంతో మంచు త్వరగా కరిగే అవకాశం కూడా లేదని, రాబోయే రోజుల్లో తీవ్రమైన చలి ఉంటుందని వాతావరణ నిపుణులు అప్రమత్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన ఇప్పటికే టెన్నెస్సీ, జార్జియా, నార్త్ కరోలినా, మేరీల్యాండ్‌తో పాటు దాదాపు 12 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి గుర్తిస్తూ ఆమోదం తెలిపారు. ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి ఫెడరల్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ట్రంప్ సూచన చేశారు.
13 వేల విమానాలు రద్దుస
మంచు తుపాను ధాటికి శనివారం, ఆదివారం కలిపి ఏకంగా 13 వేలకు పైగా విమానాలు రద్దు అయ్యాయని కథనాలు వెలువడుతున్నాయి. దీంతో, అమెరికాలో విమాన ప్రయాణాలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది. విమానాలను ట్రాక్ చేసే ‘ఫ్లైట్‌అవేర్’ (FlightAware) లెక్కల ప్రకారం, శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా 13,000 కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయ్యాయి. కరోనా మహమ్మారి తర్వాత ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం ఇదే తొలిసారని ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ ‘సిరియం’ వ్యాఖ్యానించింది. మంచు తుపాను ధాటికి ఎయిర్‌పోర్టుల్లో కార్యకలాపాలు స్థంభించిపోయిన పరిస్థితులు అమెరికాలో కనిపిస్తున్నాయి. ఓక్లహోమా సిటీలోని విల్ రోజర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. డల్లాస్, చికాగో, అట్లాంటా, నాష్‌విల్లే, షార్లెట్ వంటి ప్రధాన ఎయిర్‌పోర్టుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్యాసింజర్లు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
గడ్డకట్టే వాతావరణం, విపరీతమైన మంచు వర్షం కారణంగా చెట్లు, విద్యుత్ లైన్లపై మంచు పేరుకుపోతోంది. దీంతో, కరెంట్ సరఫరాలో అంతరాయాలు ఎక్కువయ్యాయి. శనివారం సాయంత్రానికి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో లక్షా 50 వేల మంది కరెంట్ లేకండానే ఉండాల్సి వచ్చింది. లూసియానా, టెక్సాస్ విద్యుత్ సరఫరా సమస్య ఎక్కువగా ఉంది. మంచు ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో హురికేన్ (తుపాను) స్థాయికి సమానంగా నష్టం ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Also- Bandi Sanjay: సింగరేణి అక్రమాలు, దోపిడీకి సంబంధించిన రికార్డులన్నీ సీజ్ చేయాలి.. బండి సంజయ్ డిమాండ్!

