MLA Yennam Srinivas Reddy: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు ఐఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించడమే లక్ష్యంగా ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు శ్రీకారం చుట్టినట్లు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బోయపల్లిలోని వైటీసీ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ పథకానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, సరైన మార్గదర్శకత్వం, శిక్షణ లేక వెనుకబడిపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.
Also Read: MLA Yennam Srinivas Reddy: కవితపై ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఐఐఐటీ సీట్ల సాధనే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో రూ. 600 కోట్లతో ఐఐఐటీ కళాశాల నిర్మాణానికి భూమిపూజ చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత ఏడాది జిల్లా నుంచి ఐఐఐటీ ప్రవేశాల్లో కేవలం 5 శాతం లోపు మాత్రమే విద్యార్థులు ఎంపికయ్యారని, ఈ ఏడాది ఆ సంఖ్యను కనీసం 15 నుండి 20 శాతానికి పెంచాలనే సంకల్పంతో ఈ ప్రత్యేక శిక్షణను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ కోసం నిర్వహించిన మెరిట్ పరీక్షకు 17 మండలాల నుండి 750 మంది హాజరుకాగా, అత్యంత ప్రతిభ కనబరిచిన 150 మందిని ఎంపిక చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీరికి ఈ నెల 27 నుండి అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందంతో శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ కాలంలో వసతి, భోజనం, ఇతర వసతులు పూర్తిగా ఉచితంగా కల్పిస్తామని ఆయన వివరించారు.
చదువుల నిలయంగా పాలమూరు
మహబూబ్‌నగర్‌ను విద్యా నిలయంగా మార్చేందుకు నియోజకవర్గంలోని పలు కళాశాలలకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఎంవీఎస్ కళాశాలకు రూ. 30 కోట్లు, ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలకు రూ. 6.86 కోట్లు ఇలా విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరును చదువుల జిల్లాగా మార్చేందుకు ఎమ్మెల్యే తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థులను ఐఐఐటీ సీటు సాధించేలా సమగ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

