Victorian Disease: అమెజాన్‌కు చెందిన ఓ గిడ్డింగిలో ఏకంగా 10 మందికి టీబీ వ్యాధి (Victorian Disease) నిర్ధారణ కావడం విస్మయం కలిగిస్తోంది. యూకేలోని కోవెంట్రీలో ఉన్న అమెజాన్ గిడ్డింగులలో ఒకదాంట్లో ఈ కేసులను గుర్తించారు. అక్కడ సుమారుగా 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, ఓ వ్యక్తికి టీబీ (TB) ఉన్నట్టుగా ‘యూకే నేషనల్ హెల్త్’ గుర్తించింది. అనంతరం అమెజాన్ గిడ్డింగికి వెళ్లి ఉద్యోగులు అందరికీ టెస్టులు చేయగా, ఏకంగా 10 మందికి నిర్దారణ అయ్యింది. అయితే, టీబీ వ్యాధి ముదరకుండా ‘నిద్రావస్థ దశ’లోనే ఉంది. అంటే, ఈ దశలో లక్షణాలు బయటకు కనిపించవు. ఆ దశలో ఇతరులకు కూడా సోకదని ఒక ప్రకటనలో అమెజాన్ తెలిపింది. గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ కేసులు వెలుగుచూశాయని వెల్లడించింది. తాజాగా, మరోసారి ఉద్యోగులు అందరికీ టెస్టులు నిర్వహించగా కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కొనసాగుతున్నట్టు వివరించింది. సదరు గిడ్డింగిలో కార్యకలాపాలు కూడా యథావిథిగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
కాగా, యూకేలో టీబీని ‘విక్టోరియన్ డిసీజ్’ అని కూడా అంటారు. కాగా, అమెజాన్ ఉద్యోగుల్లో గుర్తించిన టీబీని ‘లాటెంట్ ట్యుబర్‌క్యులోసిస్’ (Latent TB) ఇన్ఫెక్షన్ అని వ్యవహరిస్తారు. ఎందుకంటే, ఒక వ్యక్తి శరీరంలోకి టీబీ బ్యాక్టీరియా ప్రవేశించినప్పటికీ, అది నిద్రావస్థలో ఉంటుంది. ఈ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. బాధితుల్లో ఎలాంటి అనారోగ్య లక్షణాలు ఉండవు. అంతేకాదు వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. అయితే, చర్మ పరీక్ష, లేదా బ్లడ్ టెస్ట్ ద్వారా గుర్తించేందుకు వీలుంటుంది. సకాలంలో ట్రీట్‌మెంట్ తీసుకుంటే భవిష్యత్తులో తీవ్రమైన టీబీ వ్యాధిగా మారకుండా ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే అనుమానమే!
లాటెంట్ టీబీ లక్షణాలు బయటకు కనిపించవు. కానీ, కొన్ని లక్షణాలు బయటపడితే అనుమానించాల్సిందే. మూడు వారాల కంటే ఎక్కువ దగ్గు ఉండడం, ఛాతీ నొప్పి, దగ్గినప్పుడు రక్తం, లేదా కఫం పడటం, అలసట, నీరసం, బరువు తగ్గడం, జ్వరం, రాత్రిపూట చెమటలు పట్టడం వంటివి లాటెంట్ టీబీ లక్షణాలుగా ఉంటాయి. గాలిలో ఉండే టీబీ బ్యాక్టీరియా కలిసిన తుంపర్లను పీల్చినప్పుడు లాటెంట్ టీబీ సంక్రమిస్తుంది. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తులకు లాటెంట్ టీబీ సోకినా దానిని నిరోధించగలుగుతుంది. అయితే, యాక్టివ్ టీబీ ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండటం, బలహీనమైన రోగనిరోధక శక్తి, టీబీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు జర్నీ చేయడం, ఆ ప్రాంతాల్లో నివసించడం, అపరిశుభ్రమైన ప్రాంతాల్లో ఉంటే టీబీ ముదిరే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, యూకేలో టీబీ కేసులు పెరుగుతున్నాయి. యూకేహెచ్ఎస్ఏ గణాంకాల ప్రకారం, 2024లో ఆ దేశంలో టీబీ కేసుల సంఖ్య 13.6 శాతం పెరిగింది. సుమారుగా 5,500 మందికి పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. అయితే, అమెజాన్ కోవెంట్రీ గిడ్డంగిలో వ్యాధి సోకినవారి నుంచి ఇతరులకు రాబోదని వైద్యులు తెలిపారు.
Read Also- Kavitha – PK Alliance: కవిత కొత్త పార్టీ.. రంగంలోకి రాజకీయ వ్యూహాకర్త పీకే.. వర్కౌట్ అయ్యేనా?

