Kavitha – PK Alliance: బీఆర్ఎస్ బహిష్కృత నేత, కేసీఆర్ (KCR) తనయ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) త్వరలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఉద్యమ సంస్థ లేదా స్వచ్ఛంద సంస్థగా ఉన్న ‘తెలంగాణ జాగృతి’ (Telangana Jagruthi)ని రాజకీయ పార్టీగా ఆమె రూపాంతరం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కవిత రాజకీయ పార్టీకి సంబంధించి మరో సంచలన విషయం వెలుగు చూసింది. ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే)తో కవిత చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కవితతో కలిసి పనిచేయడానికి పీకే సైతం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కవిత, పీకే రాజకీయ కలయిక తెలంగాణ పాలిటిక్స్ లో ప్రభావం చూపుతుందా? లేదా? అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం.
పీకే అనుభవం కలిసొచ్చేనా?
ప్రశాంత్ కిశోర్ (పీకే)కు విజయవంతమైన రాజకీయ వ్యూహాకర్తగా దేశంలో మంచి పేరుంది. అయితే కొద్దికాలం క్రితం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పీకే.. బిహార్ లో జన సురాజ్ పార్టీని స్థాపించారు. అయితే ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా విఫలమయ్యింది. ఎన్నో పార్టీని తన వ్యూహాలతో గెలిపించిన ప్రశాంత్ కిశోర్.. తను స్థాపించిన పార్టీ నుంచి కనీసం ఒక్క అభ్యర్థిని (తనతో సహా) కూడా గెలిపించుకోలేకపోయారు. అంతమాత్రనా పీకేకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం కొట్టిపారేయడానికి వీల్లేదు. జాతీయ స్థాయి పార్టీలతో పనిచేసిన అనుభవం, క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీలను గెలిపించిన విధానం.. తెలంగాణలో కవితకు కలిసి వచ్చే అవకాశముంది.
కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసే పార్టీ కోసం పని చేయనున్న ప్రశాంత్ కిషోర్?
కవితతో కలిసి పని చేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి
రెండు నెలల వ్యవధిలో కల్వకుంట్ల కవితను హైదరాబాద్ కు వచ్చి రెండు సార్లు కలిసిన ప్రశాంత్ కిషోర్
సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పీకేతో కవిత సమావేశం… pic.twitter.com/CqMmCKeaxL
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2026
ఈ అంశాలపై ఫోకస్!
కవిత ఇప్పటికే తన కొత్త పార్టీ విధానాల రూపకల్పనకు 50 కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నారు. ఒకవేళ పీకే సైతం కవితతో కలిసి పనిచేస్తే.. అతడి డేటా ఆధారిత వ్యూహాలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు, గ్రాస్‌రూట్ మొబిలైజేషన్ ప్రణాళికలు కవితకు కలిసి రావొచ్చు. అతడు కవిత నాయకత్వాన్ని ‘మహిళా శక్తి – ప్రాంతీయ గౌరవం – సామాజిక న్యాయం’ కోణంలో బలంగా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కవితకు పీకే ద్వారా మార్గం సుగమం కావొచ్చు. యువత, మహిళలను కవిత పార్టీ పట్ల ఆకర్షితులయ్యేలా.. పీకే గ్రౌండ్ వర్క్ చేసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండగా.. మూడో శక్తిగా కవిత పార్టీ ఎదిగేందుకు పీకేతో కలయిక ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
Also Read: Ramchander Rao: తులసి వనంలో ‘గంజాయి మొక్కలు’.. కాంగ్రెస్ పై రాంచందర్ రావు ఫైర్..!
కవిత పార్టీకి సవాళ్లు..!
రాజకీయ వ్యూహాకర్తను తన పార్టీ కోసం నియమించుకున్నంత మాత్రాన కవితకు కచ్చితంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. పీకే ఇప్పటివరకూ బలమైన పార్టీలకు మాత్రమే వ్యూహాకర్తగా పని చేస్తూ వచ్చారు. 2014 – నరేంద్ర మోదీ (బీజేపీ), 2015 – నితీష్ కుమార్ (బిహార్), 2017 – కాంగ్రెస్ (పంజాబ్), 2021 – మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్)లతో పీకే కలిసి పనిచేయగా.. అవి సత్ఫలితాలు ఇచ్చాయి. అయితే కవితది ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న పార్టీ. అది కూడా బలమైన బీఆర్ఎస్ పార్టీని, తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీశ్ రావులపై విమర్శలు గుప్పించి మరి ఆమె బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో స్థానిక డైనమిక్స్ పాలిటిక్స్ కారణంగా పీకే వ్యూహాలు ఏమాత్రం పనిచేస్తాయో చెప్పడం కష్టమే. పైగా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే ముక్కోణపు పోటీ (కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ) నెలకొని ఉంది. ఈ సమయంలో నాల్గో పార్టీగా వచ్చి కవిత రాణించడం కష్టసాధ్యం అవ్వొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కవితపై ఉన్న కేసులు, కేంద్ర సంస్థల ఒత్తిడి, కేడర్ నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను ఆమె ఎలా అధిగమిస్తారన్న దానిపై కవిత కొత్త పార్టీ భవితవ్యం ఆధారపడనుంది.

