Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బూతు పార్టీలుగా తయారయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సమక్షంలో నగరానికి చెందిన పలువురు డాక్టర్లు, ఫార్మా నిపుణులు కమలం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి రాంచందర్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే జీహెచ్ఎంసీ(GHMC) ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని, అందుకు అందరు కలిసి కట్టుగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఎప్పటికైనా కాషాయమయం కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కర్ణాటకలో సైతం బీజేపీ(BJP) అధికారంలో రాబోతోందని వ్యాఖ్యానించారు. విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. నాడు క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవారు రాజకీయాల్లో రావాలని చూసేవారని, కానీ ఇప్పుడు సీన్ అందుకు భిన్నంగా ఉందన్నారు. చదువుకున్న యువత రాజకీయాల వైపునకు రావాలని ఆలోచిస్తున్నారని, బీజేపీ దేశానికి అవసరమని గుర్తించి ఈ పార్టీలో చేరుతున్నారన్నారు. మోదీ నేతృత్వంలో జెన్ జీ నాయకత్వం ఉరకలు వేస్తున్నదన్నారు.
జాతీయ హోదాను కోల్పోయే పరిస్థితి..
దేశంలో రోజు రోజుకు దేశ వ్యతిరేక శక్తులు పెరుగుతున్నాయని విమర్శించారు. వాటిని ఎదుర్కోవాలంటే అంతా కలిసి ఒక శక్తిగా ఎదగాల్సిన అవసరముందన్నారు. జాతీయ వాదాన్ని బలంగా నిర్మించే శక్తులుగా తయారవ్వాలన్నారు. దేశ వ్యతిరేక శక్తులు జేఎన్‌యూ లాంటి విద్యాలయాల్లో మోదీ, అమిత్ షాపై విషం చిమ్ముతున్నాయని రాంచందర్ రావు ధ్వజమెత్తారు. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదాను కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఇది దేశవ్యాప్తంగా కనిపిస్తున్న వాస్తవ రాజకీయ పరిణామమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అనే పవిత్ర లక్ష్యానికి అడ్డుగా నిలబడి, తులసి వనంలో గంజాయి మొక్కలా వ్యవస్థను లోపల నుంచే దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ రాజకీయాలు సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్.. ఒక్కొక్క రాష్ట్రాన్ని కోల్పోతూ, దేశ రాజకీయాల్లో క్రమంగా తన ప్రాధాన్యతను కోల్పోయి, కనుమరుగయ్యే దశకు చేరుకుంటోందని ఎద్దేవాచేశారు.
నేడు ఢిల్లీకి రాంచందర్ రావు
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికల సందర్భంగా సోమవారం ఉదయం ఢిల్లీకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వెళ్లనున్నారు. జాతీయ అధ్యక్షుడి ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర శాఖ తరపున పాల్గొంటారు. నేడు జరిగే నామినేషన్ ప్రక్రియలో తెలంగాణ తరపున భాగస్వామ్యం కానున్నారు.
Also Read: Chiranjeevi: వింటేజ్ మెగాస్టార్‌ని చూసేందుకు తరలివస్తున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న లేఖలు!

