Bandi Sanjay: నైనీ బొగ్గు గనుల టెండర్ ప్రక్రియ సహా 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన అక్రమాలు, దోపిడీకి సంబంధించిన రికార్డులన్నీ తక్షణమే సీజ్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. లేదంటే ఆ రికార్డులను తారుమారు చేసే ప్రమాదం ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. కోర్టు కేసుల్లో విచారణకు హాజరయ్యేందుకు హైదరాబాద్‌కు వచ్చిన బండి సంజయ్(Bandi Sanjay) నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణ వచ్చాక సింగరేణి ఎక్కువ దోపిడీకి గురైందని ఆరోపించారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పాలకులు సింగరేణిని దోచుకున్నారని ఆరోపించారు. ఆ దోచుకున్న సొమ్ముతోనే బీఆర్ఎస్ నడుస్తున్నదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, నేడు కాంగ్రెస్ పాలనలో మంత్రులు, దళారులు సింగరేణిని దోచుకుంటున్నది వాస్తవమేనన్నారు.
Also Read: Bandi Sanjay: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పథకం ఎందుకు వద్దు..?
అవినీతిపై విచారణ జరుపుదామా?
కాంగ్రెస్ అవినీతిపై హరీశ్ రావు లేఖ రాస్తే బీఆర్ఎస్ అవినీతిపై కూడా విచారణ జరుపుదామా అని మంత్రి భట్టి చెబుతూ టైంపాస్ చేసుకుంటున్నారే తప్ప విచారణ మాత్రం జరపడం లేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపు, జరిగిన దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రూ.42 వేల కోట్ల సింగరేణి సొమ్మును దారి మళ్లించి ఆ సంస్థను నష్టాల్లోకి నెట్టారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు సింగరేణిని లాభాల్లోకి తెస్తామంటారని, అధికారంలోకి వచ్చాక ఆ సొమ్మునంతా దారి మళ్లించడం రెండు పార్టీలకు పరిపాటైందని విమర్శించారు.
నిబద్ధతతో విచారణ జరిపే స్వేచ్ఛ ఇవ్వాలి
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌ను సాక్షిగా పిలిచామని మంత్రులు చెబుతుంటే, విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారని, ఇందులో ఏది నిజమని బండి ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ సహా అందరినీ సాక్షిగా పిలిస్తే అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ దొంగలను సాక్షులుగా పిలవడమేంటని ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్ విచారణను ప్రత్యక్షంగా, పరోక్షంగా మంత్రులు ప్రభావితం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సిట్ అధికారులకు నిజాయితీ, నిబద్ధతతో విచారణ జరిపే స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. అధికారంలో ఉన్నంత కాలం ప్రజల సొమ్మును దోచుకుని అరాచకాలకు పాల్పడ్డ కేసీఆర్ కుటుంబానికి అన్నీ లొట్టపీసు కేసుల్లాగే కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. ఎన్ని అరాచకాలు, అవినీతి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే ధీమా కేసీఆర్ కుటుంబంలో ఉన్నదని, కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. తాను గతంలో కేటీఆర్‌పై సవాల్ విసిరితే లీగల్ నోటీసులంటూ డ్రామాలాడారని, పోనీ ఆ లీగల్ నోటీసులకైనా కట్టుబడి ముందుకు సాగుతారా అంటే మధ్యలోనే పారిపోయే పరికిపంద అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Also Read: Bandi Sanjay Cricket: కాన్వాయ్ ఆపి మరీ.. క్రికెట్ ఆడిన కేంద్రమంత్రి బండి సంజయ్

