Bandi Sanjay: హుస్నాబాద్ లో క్రికెట్ ఆడిన కేంద్ర మంత్రి
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay Cricket) మంగళవారం నాడు సరదాగా క్రికెట్ ఆడారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో హుస్నాబాద్‌లోని మర్రి క్రాస్ రోడ్స్ సమీపంలో కొద్దిసేపు యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. ‘యూనిటీ కప్ క్రికెట్ టోర్నమెంట్’ పేరుతో బల్లునాయక్ తండా, జిల్లెల గడ్డ, మీర్జాపూర్, వంగరామయ్య పల్లి గ్రామాలకు చెందిన యువకులు జట్లుగా ఏర్పడి క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. వందలాది మంది ఈ క్రికెట్ పోటీలను వీక్షించేందుకు వచ్చారు. అయియే, అటువైపు వెళుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌ను చూసిన యువకులంతా అక్కడికి వెళ్లారు. దీంతో వెంటనే కిందకు దిగిన బండి సంజయ్ వారితో కలిసి క్రికెట్ గ్రౌండ్‌కు నడుచుకుంటూ వెళ్లారు.
క్రికెట్ పోటీలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. యువకుల కోరిక మేరకు క్రికెట్ పిచ్ వద్దకు బ్యాట్ అందుకున్నారు. క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్న యువకులు బౌలింగ్ చేయగా బండి సంజయ్ బ్యాటింగ్ చేశారు. రెండు బంతులను బౌండరీ లైన్ కూడా దాటించారు. బండి సంజయ్ క్రికెట్ ఆడడాన్ని అక్కడున్న ఆసక్తిగా గమనించారు. ఎలాంటి గొడవ లేకుండా ప్రశాంతంగా క్రికెట్ ఆడుకోవాలని ఈ సందర్భంగా ఆటగాళ్లకు కేంద్ర మంత్రి సంజయ్ సూచించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బీజేపీ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి తోట స్వరూప, లక్కిరెడ్డి తిరుమల, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్, మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్, పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు, మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, నాయకులు అనంతస్వామి, రాంప్రసాద్ , రాయికుంట చందు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ చలాన్లపై సీఎం మాటమార్చారు: బండి సంజయ్
ట్రాఫిక్ చలాన్ల నగదు వెంటనే డిడక్ట్ అయ్యేలా, ఆటో డెబిట్ చేయాలని, ఈ మేరకు బ్యాంక్ అకౌంట్లను లింక్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మంగళవారం స్పందించారు. ట్రాఫిక్ చలాన్లపై సీఎం రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈమేరకు సోషల్ మీడియాలో బండి సంజయ్ స్పందించారు. ‘‘చలాన్లపై 50 శాతం తగ్గింపు ఇస్తామంటూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, ఇప్పుడు అందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం చూస్తుంటే ఇతర హామీల మాదిరిగా ఇది కూడా ఏమార్చినట్టుగా అనిపిస్తోంది. భద్రత చాలా ముఖ్యమైనది. ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. కానీ, చలాన్ల కోసం ‘ఆటో డెబిట్ (బ్యాంకు ఖాతా నుండి నేరుగా కట్ చేయడం) విధానాన్ని ప్రతిపాదించడం అత్యంత దారుణం. ఒకవేళ ఇదే సరైన మార్గం అనుకుంటే, కనీసం వాహనాలు నడపడానికి అనువైన రోడ్లను కూడా వేయడంలో విఫలమైనందుకు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి అయిన ట్విట్టర్ టిల్లు (కేటీఆర్‌ను ఉద్దేశించి) వారి బ్యాంకు ఖాతాలను ముందుగా లింక్ చేయాలి. తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి ‘జన్ ధన్’ ఖాతాలను ఇస్తుంటే, కాంగ్రెస్ మాత్రం నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల నుంచే దోచుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, హామీ ఇచ్చిన 420 పథకాలకు కూడా ఇదే విధంగా ట్రెజరీ నుంచి ‘ఆటో డిడక్షన్’ అమలు చేయాలి. కేవలం జరిమానాలకే కాకుండా, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా, పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజల ఖాతాల్లోకి ఆ డబ్బును ఆటోమేటిక్‌గా జమ చేయండి’’ అని విమర్శిస్తూ బండి సంజయ్ పోస్ట్ పెట్టారు.

