Ponguleti Srinivas Reddy: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాన ప్రాధాన్యతతో అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy)అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
Also Read: Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు
రూ.1.50 కోట్లతో మున్సిపల్ మార్కెట్ భవనం
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నగరాభివృద్ధి నిధుల ద్వారా రూ.1.50 కోట్లతో మున్సిపల్ మార్కెట్ భవనం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మున్సిపాలిటీ కార్యాలయ భవనానికి కూడా శంకుస్థాపన చేశారు. దమ్మపేట గ్రామంలో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తోందన్నారు.
18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన
సమ్మక్క – సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలిని అనుసరిస్తూ మేడారం ఆలయాన్ని రాతి నిర్మాణాలతో అభివృద్ధి చేస్తున్నామని, ఇవి మరో 200 సంవత్సరాలు నిలిచేలా రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు రానుండగా, 19న అభివృద్ధి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

