Collector Hanumantha Rao: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు (Collector Hanumantha Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటల పాటు ఆసుపత్రిలో పర్యటించిన ఆయన, సిబ్బంది తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 82 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందులో సమయపాలన పాటించని 63 మంది, అనుమతి లేకుండా గైర్హాజరైన 19 మంది సిబ్బంది ఉన్నారు.
నిర్లక్ష్యంపై ఉక్కుపాదం
తనిఖీ సందర్భంగా కలెక్టర్ ప్రతి వార్డును సందర్శించి రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. “ప్రభుత్వ ఆసుపత్రికి నిరుపేదలు వస్తారు.. మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, ఇష్టానుసారం సేవలు అందిస్తామంటే కుదరదు” అని సిబ్బందిని హెచ్చరించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ విభాగాల్లో వైద్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఏ ఒక్క పేషెంట్‌ను కూడా అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేయకూడదని స్పష్టం చేశారు.
Also Read: Collector Hanumantha Rao: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు
రోగులతో ముఖాముఖి
కలెక్టర్ ఎమర్జెన్సీ వార్డు, ఎస్ఎన్సీయూ, పీడియాట్రిక్, డెలివరీ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడుతూ.. “డాక్టర్లు సమయానికి వస్తున్నారా? మందులు, టీకాలు వేస్తున్నారా? భోజనం నాణ్యత ఎలా ఉంది?” అని ఆరా తీశారు. శానిటేషన్ సరిగ్గా లేకపోవడంపై సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మాణ పనులపై అసహనం
ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనుల పట్ల కాంట్రాక్టర్‌పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. విధుల్లో విఫలమైతే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

