Collector Hanumanth Rao: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని కలెక్టర్ అడిగారు. దీంతో కీర్తి కుమార్ అనే విద్యార్థి ధైర్యంగా కలెక్టర్ ముందుకొచ్చి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఫిర్యాదు చేశాడు. వెంటనే ఎంపీడీవోతో కలెక్టర్ మాట్లాడి వివరాలు ఆరా తీశారు. వారికి స్థలం లేదని, ఎల్-2లో ఉన్నందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని విద్యార్థికి వివరించారు. విద్యార్థి ధైర్యాన్ని మెచ్చుకొని కలెక్టర్ అభినందించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ వాలీబాల్ ఆడారు. జిల్లా స్థాయిలో జరిగిన వాలీబాల్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలిసి క్రీడలతో పాటు చదువులో కూడా సత్తా చాటాలని సూచించారు.
అనుమతి లేకుండా వైద్యం చేస్తే చర్యలు తప్పవు
భువనగిరి పట్టణంలో నాలుగు నెలల క్రితం గాయత్రి హాస్పిటల్, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ డయగ్నస్టిక్ సెంటర్‌పై ఆకస్మిక దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అక్రమ అబార్షన్లు, భ్రూణ హత్యలు జరుగుతున్నట్లు ఆధారాలు లభించాయి. దాంతో పాటు లక్ష్మీనరసింహస్వామి డయగ్నస్టిక్ సెంటర్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినందుకు, అక్కడి స్కానింగ్ మెషీన్, సంబంధిత రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సమగ్ర విచారణ చేపట్టాలి
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ హనుమంతరావు సమగ్ర విచారణ చేపట్టాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులకు ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ డయగ్నస్టిక్ సెంటర్, గాయత్రి హాస్పిటల్ రెండింటిలోనూ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలాయి. దీంతో కలెక్టర్ హనుమంతరావు సదరు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, అనుమతులను రద్దు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రి, డయగ్నస్టిక్ సెంటర్స్, స్కానింగ్ సెంటర్స్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు, అక్రమ అబార్షన్, బ్రూణ హత్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ధరల నియంత్రణపై స్పందించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు
