Jubilee Hills By Election exit poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ మంగళవారం ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ (Congress) విజయం సాధిస్తుందని ముక్తకంఠంతో పేర్కొన్నాయి. 5-8 శాతం ఓట్ల తేడాతో హస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Neveen Yadav) విజయ కేతనం ఎగురవేస్తారని అభిప్రాయపడ్డాయి. అయితే ప్రీ పోల్స్ (Pre Polls Survey)లో బీఆర్ఎస్ (BRS) విజయం ఖాయమని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) వచ్చేసరికి వాటి అంచనాలన్నీ రివర్స్ కావడం గమనార్హం. ఎన్నికల ప్రచారం చివర్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగడం.. విజయమే లక్ష్యంగా ఆయన కదిపిన పావులు, బీఆర్ఎస్ స్వయంకృతపరాధం.. కాంగ్రెస్ గెలుపునకు మార్గం సుగమం చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీఎం రేవంత్ మ్యాజిక్..
జూబ్లీహిల్స్ ఎన్నికలకు వారం, పది రోజుల ముందు వరకూ కూడా తన సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని విశ్లేషణలు వెల్లువడ్డాయి. మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) మరణంతో ఆయన భార్య సునీతకు బీఆర్ఎస్ సీటు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ సెంటిమెంట్ బాగానే పనిచేసిందని.. బీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేనని అంతా భావించారు. ఈ దశలో పట్టువదలని విక్రమార్కుడిలా ఎన్నికల ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి.. తన వ్యూహాలతో పోలింగ్ గతినే మార్చేశారు. స్వయంగా క్షేత్రస్థాయిలో దిగి బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. అంతేకాదు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బలహీనంగా ప్రాంతాల్లో మరింత ఫోకస్ పెట్టేలా మంత్రులు, క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కు సరిగ్గా రెండ్రోజుల ముందు హైదరాబాద్ లో నిర్వహించిన సుదీర్ఘ ప్రెస్ మీట్ ద్వారా కాంగ్రెస్ పై జూబ్లీహిల్స్ ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. తద్వారా సీఎం రేవంత్ గెలుపునకు బాటలు వేశారు.
అజారుద్దీన్‌కు మంత్రి పదవి
జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను కేబినేట్ లోకి తీసుకోవడం కలిసివచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉపఎన్నికల్లో ఎంఐఎం (MIM) మద్దతు ఇచ్చినప్పటికీ.. మెజారిటీ ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపే ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ను తెరపైకి తీసుకొని రావడం, మైనారిటీ అయిన అతడ్ని ఏకంగా మంత్రిని చేయడం ముస్లిం ఓటర్ల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ ను మంత్రిని చేయాలన్న నిర్ణయం ఎప్పుడో తీసుకున్నప్పటికీ సరిగ్గా జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనే కేబినేటిలోకి తీసుకోవడమనేది సీఎం రేవంత్ చేసిన మంచి వ్యూహాంగా నిపుణులు చెబుతున్నారు.
స్పాట్‌లో సమస్యల పరిష్కారం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్ ఒక్కో మంత్రిని ఇంఛార్జ్ గా సీఎం రేవంత్ రెడ్డి నియమించడం వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ క్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలకు అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కారం చూపారు. మరికొన్ని సమస్యలను అతిత్వరలోనే పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇవ్వడం ఓటర్లలో కాంగ్రెస్ పై నమ్మకాన్ని మరింత పెంచింది. అదే విధంగా జూబ్లీహిల్స్ పరిధిలోని గేటెట్ కమ్యూనిటీల్లోనూ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించడం, వారి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇవ్వడం కూడా కాంగ్రెస్ కలిసి వచ్చింది.
Also Read: Jubilee Hills By Election: పోలింగ్ ముగిసిన తర్వాత సర్వేలు రిలీజ్ చేసిన సంస్థలు.. ఎలా ఉన్నాయంటే..!
బీఆర్ఎస్ స్వయంకృతాపరాధం..
జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ చేసిన కొన్ని తప్పిదాలు కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చింది. ఎన్నికలకు 3, 4 రోజుల ముందే బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి కుటుంబంలో వివాదం చెలరేగడ ఆ పార్టీకి మైనస్ గా మారింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారి.. కోడలు సునీత, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేయడం జూబ్లీహిల్స్ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. దీనికి తోడు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ప్రచారంలో కాంగ్రెస్ మరింత దూకుడు పెంచగా ఇందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రచార తీవ్రతను తగ్గిస్తూ వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉండటం, ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ను గెలిపించినా తమకు ఒరిగేది ఏమి లేదన్న అభిప్రాయం ఓటర్లలో పెరగడం కూడా.. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయవకాశాలను పెంచినట్లు అంచనాలు ఉన్నాయి.
