Swetcha Effect: సీలింగ్ చట్టానికి లోబడి ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లోని కొంగరకలాన్(Kongarakalan) రెవెన్యూ పరిధిలోని రూ.90 ఎకరాల భూమి బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో ప్రైవేట్ పరమైంది. అప్పటి ప్రభుత్వ పెద్దల సాయంతో వైష్ణవి కంపెనీ పట్టా చేసుకునేందుకు ప్రయత్నాలు చేసింది. సదరు భూమి ప్రభుత్వానికి సంబంధించినదని రెవెన్యూ అధికారులు స్టే తీసుకున్నారు. దానిపై హైకోర్టులో వైష్ణవి కంపెనీ(Vaishnavi Company) ప్రతినిధులు రిట్ పిటిషన్లు వేసి స్టే తీసుకున్నారు. దీంతో భూమి అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉన్నదని, ‘స్వేచ్ఛ’ దిన పత్రికలో ‘రూ.900 కోట్ల భూమికి ఎసరు’ పేరుతో ఈ నెల 8వ తేదీన కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఆర్డీవో(RDO), సంబంధిత రెవెన్యూ సెక్షన్ అధికారులకు తక్షణమే కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు హైకోర్టులో స్టే ఆర్డర్ తీసుకున్న కంపెనీపై కౌంటర్ వేసేందుకు ఫైల్ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ భూమి విషయంలో సీరియస్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. హైకోర్టులో ఆధారాలతో ముందుకెళ్తే కోట్ల విలువైన భూమిని తిరిగి దక్కించుకునే అవకాశం ఉన్నది.
కౌంటర్ ఫైల్ సిద్ధం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగర కలాన్ గ్రామంలోని 272 నుంచి 283 వరకు ఉన్న సర్వే నెంబర్లల్లో 90 ఎకరాలు సీలింగ్ భూమి. ముందు సర్ ప్లస్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం(సీసీ నెంబర్ 1/3373/75 1975) రికార్డులో నమోదు చేశారు. అయితే, 38ఈ టెనెన్సీ యాక్ట్ ద్వారా ఎల్/794/795/796 ఆర్డర్‌తో రెగ్యులరైజ్ అయింది. 2024లో రెవెన్యూ విభాగంలోని అదనపు కలెక్టర్ రెవెన్యూ దగ్గర ఏవోఎల్ఆర్ ఆర్డర్‌తో ప్రభుత్వ భూమి అంటూ స్టే తీసుకున్నారు. దీనిపై వైష్ణవి కంపెనీ ప్రతినిధులు సుమారుగా 30 రిట్ పిటిషన్లు హైకోర్టులో వేశారు. వీటిపై రెవెన్యూ అధికారులు తిరిగి కౌంటర్ దాఖలు చేయలేదు. దీనిని గుర్తు చేస్తూ, ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్న తీరును వివరిస్తూ ‘స్వేచ్ఛ’ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో కౌంటర్ వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
Also Read: Gold Missing Crime: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ప్రగతి ఆసుపత్రిలో మహిళ డెడ్ బాడీ నుంచి బంగారం మాయం
భూ విస్తీర్ణం వివరాలు
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వెనుక భాగంలోనే ఈ 90 ఎకరాల ప్రభుత్వం స్థలం ఉన్నది. ఇక్కడ ఎకరం విలువ సుమారుగా రూ.10 కోట్లు ఉంటుంది. 90 ఎకరాలకు రూ.900 కోట్లు అన్నమాట. ఇంత విలువైన భూమిపై కన్నేసిన వైష్ణవి కంపెనీ ఎలాగైనా లాగేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. కొంగరకలాన్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లల్లో 272లో 9 ఎకరాల 37 గుంటలు, 273లో 10 ఎకరాల 37 గుంటలు, 274లో 10 ఎకరాల 7 గుంటలు, 275లో 9 ఎకరాల 39 గుంటలు, 276లో 12 ఎకరాల 26 గుంటలు, 277లో 6 ఎకరాల 31 గుంటలు, 278లో 9 ఎకరాల 32 గుంటలు, 279లో 9 ఎకరాల 31 గుంటలు, 280లో 10 ఎకరాల 39 గుంటలు, 281లో 10 ఎకరాల 7 గుంటలు, 282లో 15 ఎకరాల 7 గుంటలు, 283లో 15 ఎకరాల 20 గుంటల చొప్పున ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చారు.
