Harish Rao: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్ష చూపుతూ, వారి పొట్ట కొడుతున్నాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు (Harish Rao) తీవ్రంగా మండిపడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
సర్పంచ్‌లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్‌లు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే వస్తాయని, కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సర్పంచ్‌ల కోసం తూప్రాన్ కేంద్రంగా త్వరలోనే నిధుల సేకరణ, అధికారులతో సమన్వయం తదితర అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు.
Also Read: Harish Rao: మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కాయం : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
రైతులకు రుణమాఫీ పూర్తి చేయాలి
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల మెదక్ జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో కరెంటు, ఎరువులు, రైతుబంధుకు ఎలాంటి ఢోకా లేదని, నేడు ఈ ప్రభుత్వం యాప్‌లు, మ్యాప్‌ల పేరుతో దొంగనాటకాలు ఆడుతోందని విమర్శించారు. గణపురం ప్రాజెక్టు ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని, రైతులకు రుణమాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కంటారెడ్డి తిరుపతి రెడ్డి, దేవేందర్ రెడ్డి, లావణ్య రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, మెన్నేని మదన్ మోహన్ రావు, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Harish Rao: రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు అభివృద్ధి బంద్!: హరీష్ రావు

