Gadwal News: గద్వాల జిల్లాలో స్థానిక సమరం పోరు తుది దశకు చేరుకుంటున్న తరుణంలో ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లో యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతున్నారు. సాధారణంగా పెద్దలు, అనుభవజ్ఞులకే పరిమితమయ్యే సర్పంచ్ పదవులకు, గతానికి భిన్నంగా యువతరం ఉత్సాహంగా ఆసక్తి చూపుతుంది. రాజకీయాలలో ఉన్నత పదవులు చేపట్టడానికి ఈ స్థానిక ఎన్నికలను తొలిమెట్టుగా భావిస్తున్నారు. పాత విధానాలను పక్కనపెట్టి, గ్రామ అభివృద్ధికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలనే ఉద్దేశంతో యువతరం పెద్ద ఎత్తున బరిలో నిలిచింది.
అభివృద్ధి లక్ష్యంతో అరంగేట్రం
తాను జన్మనిచ్చిన ఊరిని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువత స్థానిక బరిలో నిలుస్తుంది. గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం, రాజకీయాలలో మార్పు కోరుతూ, తమకు అందుబాటులో ఉండి పనిచేసే వారిని ఎన్నుకోవాలని యువతరం అభ్యర్థులు ఇంటింటా తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అనేక గ్రామాలలో ఉపాధి అవకాశాలు లేక యువత ఉద్యోగాల వేటలో నగరాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా ఉన్న వనరులు వినియోగించుకోలేకపోవడంతో పలు సమస్యలు గ్రామాలను పట్టిపీడిస్తున్నాయి. ఈ సమస్యలను రూపుమాపేందుకు తాము ఎన్నికల్లో విజయం సాధించి, ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను నెరవేరుస్తామని యువ అభ్యర్థులు హామీలు గుప్పిస్తున్నారు.
Also Read: GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!
ప్రచారంలో యువత విజ్ఞప్తి..
సర్పంచ్ స్థానాలకు పోటీ చేస్తున్న యువ అభ్యర్థులు తమను సోదరుడిగా, తమ్ముడిగా భావించి ఒకసారి అవకాశం కల్పించాలని గ్రామ ప్రజలను విన్నవిస్తున్నారు. గతంలో చాలామంది పెద్దలను ఎన్నుకున్నారని, ఇప్పుడు మార్పు కోరుతూ యువతకు ఓటు వేయాలని వారు కోరుతున్నారు. తమను గెలిపిస్తే గ్రామంలో చేయబోయే అభివృద్ధి పనులను, తమ ప్రత్యేకతలను వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాలు, వార్డుల వారీగా తమ సమూహాలను ఏర్పాటు చేసుకుని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మొదటి, రెండవ విడుతల ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో, ప్రస్తుతం మూడవ విడుత ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. కేవలం ఆదివారం ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉండడంతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచివారిని ఎన్నుకోవాలని అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మూడవ విడుతలో భాగంగా ఇటిక్యాల, ఎర్రవల్లి, అలంపూర్, ఉండవల్లి, మానవపాడు మండలాలలోని గ్రామాల సర్పంచ్, వార్డు మెంబర్లకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.
ఒక్క అవకాశం ఇవ్వండి..
ఎన్నో ఏళ్లుగా గ్రామానికి ఎందరో పెద్దలు సర్పంచులుగా పని చేశారు. ప్రస్తుతం రిజర్వేషన్లలో భాగంగా మాకు అవకాశం వచ్చింది. వ్యవసాయంతో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడిని. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్దల ఆశీర్వాదంతో పోటీ చేస్తున్నాను. అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు, ప్రజాప్రతినిధుల సహకారంతో కృషి చేస్తానిని డేవిడ్, షాబాద్ సర్పంచ్ అభ్యర్థి అన్నారు.
13 హామీలతో గ్రామాభివృద్ధి..
గ్రామం సర్వతోముఖాభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, స్వచ్ఛందంగా 13 హామీలను గ్రామ ప్రజలకు ఇవ్వడం జరిగింది. వాటిని తూ.చా తప్పకుండా పాటిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. గ్రామ ప్రజలు, పనిచేసే యువతకు ఒకసారి అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నంటూ సువర్ణ శాంతన్న, జల్లాపురం గ్రామం సర్పంచ్ అభ్యర్థి తెలిపారు.
Also Read: Jupally Krishna Rao: కొల్లాపూర్‌లో కాంగ్రెస్ హవా.. 50 స్థానాలు కైవసం : మంత్రి జూపల్లి

