GHMC: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) లోపల విలీనం చేసిన 27 పట్టణ స్థానిక సంస్థల వార్డుల పునర్విభజనకు (డీలిమిటేషన్) సంబంధించి, అభ్యంతరాలు, సలహాల స్వీకరణ కోసం జీహెచ్ఎంసీ మంగళవారం (నేడు) ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనుంది.
నేటితో ముగియనున్న గడువు
వార్డుల డీలిమిటేషన్‌పై ఈ నెల 10వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ అభ్యంతరాలు, సలహాలను స్వీకరిస్తుంది. మంగళవారం సాయంత్రంతో ఈ స్వీకరణ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో, గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఉదయం పదిన్నర గంటలకు ఈ సమావేశం జరగనుంది. తొలుత ఫ్లోర్ లీడర్లు, అనంతరం కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
Also Read: GHMC BJP: జీహెచ్‌ఎంసీలో వార్డుల డీలిమిటేషన్‌పై భగ్గుమన్న బీజేపీ.. అభ్యంతరాలు ఇవే
1950 కిలోమీటర్లు
27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం సుమారు 1950 కిలోమీటర్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో చేపట్టిన వార్డుల పునర్విభజన తీరును కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ వివరించనున్నారు. అయితే, డీలిమిటేషన్‌పై విపక్షాలైన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన సభ్యులు ఇప్పటికే తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అధికార పార్టీ సభ్యులు సైతం విపక్షాల బాటలోనే అభ్యంతరాలు తెలుపుతున్నారు. చార్మినార్ జోన్‌లో జరుగుతున్న పునర్విభజన మొత్తం ఎంఐఎం పార్టీకి రాజకీయ లబ్ది చేకూర్చే విధంగా జరుగుతుందని బీజేపీ ఆరోపణలు గుప్పించింది. అంతేకాక, విలీనం చేసిన సర్కిళ్లలో డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదని, జనాభాలో పెద్ద ఎత్తున అసమానతలు ఉన్నాయని మాజీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేశారు. సక్రమంగా డీలిమిటేషన్ చేయని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతామని వారు అల్టిమేటమ్ కూడా జారీ చేశారు.
నిరసనలకు సిద్ధమైన బీజేపీ
డీలిమిటేషన్ ఏకపక్షంగా జరిగిందంటూ బీజేపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి ముందే ప్రధాన కార్యాలయం ముందు నిరసనలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. తమ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులను రాజకీయ ఉద్దేశ్యంతోనే విభజించారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, అధికార, విపక్షాల నుంచి నిరసనలు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల సేకరణ తర్వాత ఈ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్ ప్రతిపాదనకు ఆమోదం కల్గించాలని పాలక మండలి వ్యూహరచన చేసినట్లు సమాచారం.

