Post Office vs Bank: భారతీయ కుటుంబాలు పెట్టుబడి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి. భద్రతతో పాటు.. నమ్మకమైన రాబడులు ఉన్నవాటిలోనే వారు పెట్టుబడి పెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తారు. అలా చూసుకుంటే ప్రస్తుతం చాలా మంది బ్యాంక్, పోస్టాఫీసుల్లో డబ్బు డిపాజిట్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ పోస్టాఫీస్ తీసుకొచ్చిన టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్ పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వ హామీ, స్థిరమైన వడ్డీ రేట్లు, ఈజీ డిపాజిట్ విధానం కారణంగా టీడీ స్కీమ్ విశ్వసనీయమైన ఎంపికగా నిలుస్తోంది.
గరిష్ట పరిమితి లేదు
పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ స్కీమ్ అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించబడింది. కేవలం రూ.1,000తోనే ఖాతా ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి కూడా ఇది ఉపయోగపడుతుంది. పెట్టుబడి కాలవ్యవధి 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. ఎక్కువ కాలం డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
బ్యాంక్ కంటే ఎక్కువ వడ్డీ
ప్రస్తుతం పోస్టాఫీస్ TDలపై వడ్డీ రేట్లు 6.9% నుండి 7.5% వరకు ఉన్నాయి. ఇవి చాలా బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల కంటే ఎక్కువ. పోస్టాఫీసు ప్రభుత్వ నిర్వహణలో ఉండడం వల్ల పెట్టుబడి భద్రత 100% హామీతో లభిస్తుంది. అందువల్ల తక్కువ రిస్క్, ఖచ్చితమైన రాబడులు కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.
జాయింట్ ఖాతాలు
పోస్టాఫీసులో టీడీ ఖాతాను వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ సభ్యులతో జాయింట్‌గా కూడా ప్రారంభించవచ్చు. అంతేకాదు 10 సంవత్సరాలు పైబడిన పిల్లల పేరుతో కూడా ఖాతా తెరవవచ్చు. ఇది వారి భవిష్యత్తు అవసరాలు లేదా చదువు కోసం పొదుపులను పెంచే మంచి మార్గం. 5 సంవత్సరాల TD పెట్టుబడులకు ఆదాయపన్ను చట్టంలోని 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
ముందస్తు విత్ డ్రా సౌకర్యం
బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్ తరహాలోనే పోస్టాఫీస్ టీడీ స్కీమ్ లో కూడా ముందస్తుగా డబ్బును డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఖాతాను తెరిచిన 6 నెలల లోపు ఉపసంహరణ అనుమతి లేదు. 6 నెలల తర్వాత నుంచి ఏడాదిలోపు ఉపసంహరించుకుంటే కేవలం సేవింగ్స్ అకౌంట్ వడ్డీ మాత్రమే లభిస్తుంది. 1 సంవత్సరం తర్వాత కానీ ముద్రిత కాలానికి ముందు ఖాతాను మూసేస్తే సంబంధిత వడ్డీ రేటు కంటే 2% తక్కువ వడ్డీ ఇస్తారు.
Also Read: Dussehra Holidays 2025: విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు.. లోకేశ్ కీలక ప్రకటన
రాబడి వివరాలు..
ఉదాహరణకు మీరు రూ.2,00,000ను 5 సంవత్సరాలకు డిపాజిట్ చేస్తే.. సుమారు రూ.29,776 వడ్డీ వస్తుంది. మొత్తంగా రూ.2,29,776 లభిస్తుంది. స్థిరమైన, సురక్షితమైన వృద్ధి కలిగించే పెట్టుబడిగా పోస్టాఫీసు టీడీ స్కీమ్ ఎందుకు పరిగణించబడుతుందో ఇది తెలియజేస్తుంది.