Viral Video: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసే ఐఫోన్లకు మెుబైల్ లవర్స్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొత్త వెర్షన్ మెుబైల్ కోసం వారు తెగ ఎదురుచూస్తుంటారు. ఇటీవల ఐఫోన్ 17 సిరీస్ ను యాపిల్ ప్రకటించిన తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం భారత్ లో ఐఫోన్ 17 సిరీస్ మెుబైల్ సేల్స్ మెుదలయ్యాయి. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో గల ఆపిల్ స్టోర్ వద్ద లేటెస్ట్ వెర్షన్ విక్రయాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున కస్టమర్లు స్టోర్ వద్దకు తరలిలాగా.. తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ సైతం చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, ముంబయిల్లోని యాపిల్ స్టోర్స్ లో ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచే పెద్ద ఎత్తున స్టోర్ల వద్దకు చేరుకున్న యాపిల్ లవర్స్.. షాపు తెరిచేవరకూ క్యూలోనే పడిగాపులు కాచారు. ఈ క్రమంలోనే ముంబయిలోని బీకేసీ కాంప్లెక్స్ లో గల యాపిల్ స్టోర్ వద్దకు సైతం వందలాది మంది కస్టమర్లు చేరుకున్నారు. ఈ క్రమంలో క్యూలైన్ లో కొందరు ఘర్షణకు దిగిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
వీడియోలో ఏముందంటే?
ఐఫోన్ 17 సిరీస్ మెుబైల్ కోసం వచ్చిన కొందరు కస్టమర్లు క్యూలైన్ లో ఒకరితోఒకరు గొడవపడటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. వారు పిడిగుద్దులు కురిపించుకోవడంతో క్యూలైన్ లో కలకలం రేగింది. దీంతో అక్కడే ఉన్న ఓ భద్రతా సిబ్బంది.. వారిని నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. క్యూలైన్ లో గొడవను గమనించిన మరికొందరు భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకొని.. గొడవపడుతున్న రెడ్ షర్ట్ వ్యక్తిని క్యూలైన్ లో నుంచి బయటకు లాక్కొచ్చారు. పోలీసులు లాఠీతో బెదిరించడంతో ఉద్రిక్తత కొద్దిమేర చల్లారింది.
Before Rahul Gandhi’s lapdogs & IT Cell call this as Job seekers fighting for jobs
Lemme clarify, they are fighting for iPhone 17 & this scuffle is taking place outside Apple stores pic.twitter.com/nP2PW2fO7J
— Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) September 19, 2025
Also Read: Hyderabad: ఓవైపు ఐటీ.. మరోవైపు ఈడీ.. హైదరాబాద్‌లో ముమ్మర సోదాలు
కస్టమర్ల ఆగ్రహం
ఐఫోన్ 17 సిరీస్ విక్రయాలకు సంబంధించి.. కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు లేకపోవడంపై అసంతృప్తి తెలియజేస్తున్నారు. ఫలితంగా క్యూ లైన్లలో ఘర్షణలు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. అంతేకాదు కొన్ని స్టోర్ల వద్ద.. డిమాండ్ తగ్గట్లు స్టాక్ అందుబాటులో పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లోని యాపిల్ స్టోర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూలైన్లు ఉన్నప్పటికీ.. ముంబయి స్థాయిలో మాత్రం గందరగోళం చోటుచేసుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే యాపిల్ తాజాగా iPhone 17, iPhone 17 Pro, Pro Max, అలాగే కొత్త iPhone Air మోడళ్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.82,900-2.3 లక్షల మధ్య నిర్ణయించింది.