Bangladesh Protests: భారత పొరుగుదేశమైన బంగ్లాదేశ్ మరోసారి (Bangladesh Protests) భగ్గుమంటోంది. ఈ ఏడాది జులై నెలలో షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి దారితీసిన తీవ్రస్థాయి అల్లర్ల తర్వాత, తిరిగి అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. జులైలో జరిగిన అల్లర్ల ద్వారా గుర్తింపు పొంది, నాయకుడిగా ఎదిగిన విద్యార్థి సంఘం నేత, భారత వ్యతిరేక వైఖరిని అనుసరించిన షరీఫ్ ఉస్మాన్ హదీ (Sharif Usman Hadi Death) అనే వ్యక్తి గురువారం రాత్రి చనిపోయాడు. ఇటీవల అతడిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. గాయాల పాలవ్వడంతో మలేసియాలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయాడు. అతడి మరణ వార్త గంటల వ్యవధిలోనే బంగ్లాదేశ్ అంతటా దావానలంలా వ్యాపించింది. దీంతో, శుక్రవారం వేకువజాము నుంచే దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకాయి.
రాజధాని ఢాకాతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు పెద్ద సంఖ్యలో రోడ్లెక్కారు. ఢాకాలో ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన పలు మీడియా సంస్థలపై కూడా నిరసనకారులు దాడులు చేశారు. ఆ మీడియా సంస్థలకు భారత్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో, బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ, సామాజిక పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి.
హిందూ యువకుడిపై మూక దాడి
నిరసనకారులు బంగ్లాదేశ్‌లోని మైనారిటీలైన హిందువులను టార్గెట్ చేసుకొని దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా, శుక్రవారం నిరసనలు మొదలైన తర్వాత, దీపు చంద్రదాస్ అనే 30 ఏళ్ల హిందూ యువకుడిపై మూక దాడి చేశారు. ఇస్లాం మతాన్ని అవమానించాడనే నెపంతో ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారు. కాంక్రీట్ స్లాబ్‌లతో కొట్టి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. హత్య చేయడమే కాకుండా, డెడ్‌బాడీపై డ్యాన్స్ వేశారు. అనంతరం మృతదేశానికి నిప్పు కూడా పెట్టారు. దీంతో, ఇటీవల చోటుచేసుకున్న అత్యంత దారుణమైన ఘటనలో ఒకటి కావడంతో అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అక్కడి మైనారిటీ హిందువులు ఆందోళన చెందుతున్నారు.
Read Also- Zubeen Garg: జుబీన్ గార్గ్ మరణంపై అధికారిక ప్రకటన.. అనుమానాలకు చోటు లేదని క్లారిటీ ఇచ్చిన పోలీసులు
ఎవరీ ఒస్మాన్ హదీ?
గురువారం రాత్రి చనిపోయిన షరీష్ ఒస్మాన్ హదీ ఒక విద్యార్థి సంఘం నేత. ఈ ఏడాది జులైలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల ద్వారా గుర్తింపు పొందాడు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతడు భారత్‌పై విషం కక్కుతూ వచ్చాడు. ‘ఇంక్విలాబ్ మోంచ’ పేరిట సొంతంగా ఒక విద్యార్థి సంఘాన్ని స్థాపించాడు. వీధుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడడం, యువతలో విధ్వేషాన్ని నింపుతూ వచ్చాడు. భారత్‌తో పాటు షేక్ హసీనాను కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ క్రమంలో ఇటీవలే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో గాయపడ్డాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే, అతడి మరణం వెనుక భారత్ ఉందనేది నిరసనకారుల అనుమానంగా ఉంది. ఇప్పటికే, షేక్ హసీనాను అప్పగించాలంటూ నిరసన తెలుపుతున్నవారు, ఒస్మాన్ హది మరణం తర్వాత మరింత రెచ్చపోతున్నారు.
Read Also- BSNL: దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ కొత్త యాప్ ప్రారంభం.. కస్టమర్ ఆన్‌బోర్డింగ్ కోసం సంచార్ మిత్ర

