Hyderabad Crime: మనుషుల్లో నేర ప్రవృత్తి నానాటికి పెరిగిపోతోంది. చిన్న చిన్న కారణాలకే తోటి మనిషిని అతి దారుణంగా చంపేస్తున్నారు. హైదరాబాద్ లో ఆదివారం జరిగిన పెయింటర్ హత్యకు సంబంధించి.. తాజాగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. చట్నీ మీద వేశాడన్న కారణంతోనే పెయింటర్ మురళీ కృష్ణను నలుగురు వ్యక్తులు హత్య చేసినట్లు తేలింది. అయితే నిందితుల్లో ఓ మైనర్ ఉండటం గమనార్హం.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ ఉప్పల్ లోని కల్యాణపురి ప్రాంతానికి చెందిన పెయింటర్ మురళీకృష్ణ (45) ఆదివారం జిల్లెలగూడలోని సోదరుడి ఇంటికి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి సమయంలో తిరిగి తన ఇంటికి బయలుదేరాడు. రాత్రి 1 గంట ప్రాంతంలో ఎల్బీనగర్ కు చేరుకున్న పెయింటర్.. అక్కడి నుంచి ఉప్పల్ కు వెళ్లే వాహనం కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన కారును ఆపి.. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద దింపాలని కోరాడు. కారులోని జాఫర్, సైఫుద్దీన్, మణికంఠ, మరో మైనర్ బాలుడు ఇందుకు అంగీకరించాడు. పెయింటర్ ను కారులో ఎక్కించుకొని ఉప్పల్ వైపు బయలుదేరారు.
Also Read: Rail Accident: మరో ఘోర ప్రమాదం.. పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు.. పలువురు మృతి
చెట్నీ మీద పడిందని…
అయితే పెయింటర్ మురళీకృష్ణ మద్యం సేవించి ఉండటంతో కారులోని యువకులతో ఓ విషయమై వివాదం చెలరేగింది. దీంతో వారి మధ్య మాటామాటా పెరిగింది. ఉప్పల్ వద్దకు రాగానే టిఫిన్ కోసం వారు కారును ఆపారు. ఈ క్రమంలో మురళీకృష్ణ చట్నీ మీద వేశాడని ఆరోపిస్తూ కారులో మరోమారు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కారులోని యువకులు మురళీకృష్ణపై ఒక్కసారిగా దాడి చేశారు. రెండు గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారు. నాచారం పారిశ్రామికవాడ వద్దకు కారులో బలవంతంగా తీసుకొచ్చి కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో మురళీ కృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. చనిపోయాడని నిర్ధారించుకొని నిర్మానుష్య ప్రాంతంలో అతడి శవాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి.
లిఫ్ట్ ఇచ్చి హత్య చేసిన యువకులు !
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. చట్నీ బట్టలపై పడిందన్న చిన్న కారణంతో మురళీ కృష్ణ (45)ను నలుగురు యువకులు కిరాతకంగా హత్య చేశారు. ఎల్బీనగర్ వద్ద లిఫ్ట్ తీసుకున్న మురళీ కృష్ణను కారులో ఎక్కించుకున్న యువకులు, వాగ్వాదం అనంతరం రెండు గంటల పాటు… pic.twitter.com/aVsMgfzL0H
— ChotaNews App (@ChotaNewsApp) November 5, 2025
