Rail Accident: దేశంలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన రెండు రైళ్ల ఢీ ఘటన మరువక ముందే మరో ప్రాంతంలో పట్టాలు రక్తంతో తడిసిపోయింది. యూపీలోని చునార్ రైల్వే స్టేషన్ లో పట్టాలు దాటుతున్న ప్రయాణికులపైకి నేతాజీ ఎక్స్ ప్రెస్ (Netaji Express) రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడి ఆస్పత్రిలో చేరారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
చునార్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నెం.4 వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులు పట్టాలు దాటుతున్న క్రమంలో వారిని నేతాజీ ఎక్స్ ప్రెస్ రైలు (Netaji Express) ఢీకొట్టినట్లు రైల్వే అధికారి వెల్లడించారు. ఈ దుర్ఘటనలో బాధితుల తప్పే ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఘటన జరిగిన ఫ్లాట్ ఫామ్ నెం.4 లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉన్నప్పటికీ.. కొందరు ప్రయాణికులు పట్టాలపైకి దిగినట్లు అధికారి తెలిపారు. రైలు ఆగి ఉందని భావించి.. వారు అలా చేసినట్లు చెప్పారు.
తేరుకునే లోపే ప్రమాదం
అయితే అప్పటికే నేతాజీ ఎక్స్ ప్రెస్ రైలు వెళ్లేందుకు స్టేషన్ మాస్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లోకో పైలెట్ ఒక్కసారిగా రైలును ఫ్లాట్ ఫామ్ 4 గుండా పోనివ్వడంతో పట్టాలు దాటుతున్నవారు గందరగోళానికి గురయ్యారు. దాని నుంచి తేరుకునే లోపే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
యూపీ సీఎం సంతాపం
చునార్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదస్థలానికి చేరుకొని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు రైల్వే శాఖ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తునకు ఆదేశించినట్లు రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ బై పోల్‍కు రంగం సిద్ధం.. ఎలక్షన్ కోసం 1494 బ్యాలెట్ యూనిట్లు!
రెండు రైళ్లు ఢీ..
మంగళవారం చత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక ప్యాసింజర్ రైలు వేగంగా వెళ్లి గూడ్స్ ట్రైన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా 14 మంది గాయాలైనట్లు అధికారులు తెలిపారు. మంగళవారం సా.4 గం.ల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ప్యాసింజర్ – గూడ్స్ ఎదురెదురుగా ఢీకొనడంతో పలు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
