Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 11న నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం మెటీరియల్ సిద్ధం చేసింది. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 4,01365 తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 139 లొకేషన్లలోని దాదాపు 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో సుమారు 986 మంది ఓటర్లు ఉండగా, తొమ్మిది పోలింగ్ స్టేషన్లలో1,233 మంది ఓటర్లుండగా, 263 పోలింగ్ స్టేషన్లలో 540 ఓటర్లు ఉండగా, 1200 మంది కన్నా ఎక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు మరో 11 ఉన్నాయి.
Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌లో స్వల్పంగా పెరిగిన ఓటర్లు.. ఎంతంటే?
16 మంది అభ్యర్థుల వివరాలతో బ్యాలెట్‌కు అవకాశం
ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 అభ్యర్థులుండగా, వీరితో పాటు నోటా బటన్‌తో మొత్తం 59 మంది బరిలో ఉన్నట్లు అధికారులు బ్యాలెట్‌ను సిద్దం చేశారు. ఈ బ్యాలెట్‌ను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో కమిషనింగ్ చేసే ప్రక్రియను కూడా రెండురోజుల క్రితమే పూర్తి చేశారు. ఒక్కో ఈవీఎంలో కేవలం 16 మంది అభ్యర్థుల వివరాలతో బ్యాలెట్‌కు అవకాశం ఉండటంతో ఒక్కో పోలింగ్ బూత్‌లో సుమారు నాలుగు బ్యాలెట్ యూనిట్లను వినియోగించేలా ఎలక్షన్ వింగ్ అధికారులు మెటీరియల్‌ను సిద్ధం చేశారు. ఈ ఎన్నికకు సంబంధించి రిజర్వులో ఉండాల్సిన మెటీరియల్‌తో పాటు మొత్తం 1494 బ్యాలెట్ యూనిట్లు, 826 కంట్రోల్ యూనిట్లు, మరో 837 వీవీ ప్యాట్‌లను వినియోగించేందుకు వీలుగా మెటీరియల్‌ను రెడీ చేశారు.
తొలి రోజే 97 మంది హోమ్ ఓటింగ్
80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఎన్నికల సంఘం కల్పించిన హోమ్ ఓటింగ్ మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజే 97 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. హోమ్ ఓటింగ్ కోసం మొత్తం 103మంది దరఖాస్తులు చేసుకోగా, మరో ఆరుగురు హోమ్ ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గడువున్న హోమ్ ఓటింగ్ గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే హోమ్ ఓటింగ్‌కు అవకాశముంది. దరఖాస్తు చేసుకున్న ఓటర్ల ఇంటింటికెళ్లి అధికారులు వారికి ఇంట్లో స్పెషల్ ఓటింగ్ కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించేలా ఏర్పాటు చేశారు. మంగళవారం హోమ్ ఓటింగ్‌ను వినియోగించనున్న 97 మందిలో 84 మంది వృద్దులు కాగా, మిగిలిన వారు దివ్యాంగులు ఉన్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు అభ్యర్థిస్తే హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించారు.
మొత్తం 2474 మంది పోలింగ్ ఆఫీసర్లు
బై ఎలక్షన్ ప్రక్రియలో కీలకమైన విధులు నిర్వర్తించే మూడు క్యాటగిరీల్లో మొత్తం 2474 మంది అధికారులు విధులు నిర్వర్తించనున్నారు. 600 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, మరో 600 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు కాగా, అదర్ పోలింగ్ ఆఫీసర్లుగా 1200 మందిని రిజర్వుతో కలిపి నియమించారు. వీరితో పాటు మరో 19 మంది అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించగా, నియోజకవర్గాన్ని 38 సెక్టార్లుగా విభజించి ఇతర ఎన్నికల విధుల నిర్వహణ కోసం మరో 55 మంది ఆఫీసర్లను సెక్టార్ ఆఫీసర్లుగా నియమించారు.
