Kartika Purnima 2025: తెలుగు రాష్ట్రాల్లో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివుడికి అత్యంత పవిత్రమైన రోజు కావడంతో పరమేశ్వరుడ్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివెళ్తున్నారు. కాళహస్తి (Srikalahasthi), శ్రీశైలం (Srisailam), కోటప్పకొండ (Kotappakonda), వేములవాడ (Vemulawada), వెయ్యి స్థంభాల గుడి, ముక్తేశ్వర ఆలయం సహా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. ఉదయం 4 గంటల నుంచే మహిళలు, ప్రజలు శివాలయాలకు వెళ్లి.. దీపాలు వెలిగిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో శివుడికి పూజలు చేశారు.
శ్రీశైలంలో కార్తిక శోభ
ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తిక పౌర్ణమి శోభ స్పష్టంగా కనిపిస్తోంది. వేకువజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మల్లీకార్జున స్వామి దర్శనం కోసం కాంపార్టమెంట్లలో వేచి చూస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు సర్వదర్శనాలను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. కాగా ఇవాళ సా. 7 గం.లకు ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కర హారతి, దశవిధ హారతులు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు శ్రీకాళహస్తిలోనూ భక్తుల తాకిడి అధికంగా ఉంది. కోటప్పకొండ సహా ఏపీలోని శివాలయాలకు భక్తులు తరలివెళ్లి పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
తెలంగాణ జిల్లాల్లో..
మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్తిక పౌర్ణమి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. శైవ క్షేత్రాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేయి స్తంభాల గుడి, రామప్ప, సిద్దేశ్వరాయం, పాలకుర్తి సోమేశ్వరాలయం, కోటగుళ్ళలో భక్తుల సందడి నెలకొంది. మరోవైపు మహబూబ్ నగర్, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లోనూ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే ఆలయాలకు చేరుకొని దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వరాలయంలో కార్తిక పౌర్ణమి శోభ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ నుంచి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. అక్కడి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు.
Also Read: Warangal DSP Case: వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీపై నివేదిక పూర్తి.. ఏం జరుగుతుందన్న దానిపై ఏసీబీలో జోరుగా చర్చ
కార్తీక పౌర్ణమి విశిష్టత
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలలో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు. ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదని పురాణాలు చెబుతున్నాయి. శివ కేశవునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నెలలో మహా దేవుడికి విష్ణుమూర్తికి పూజలు చేస్తే జన్మజన్మల పాపం నశిస్తుందని భక్తుల విశ్వాసం. పౌర్ణమి రోజు పవిత్ర నదిలో స్నానం చేసి శివార్చన చేయడం వలన పాపాలు తొలగి పుణ్యం దక్కుతుందని భక్తులు భావిస్తుంటారు.
