GHMC: కోటి మందికి పైగా జనాభాకు అవసరమైన అభివృద్ది పనులతో పాటు అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీ పాలక మండలి కౌన్సిల్ ఈ నెల 25న మరోసారి సమావేశం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమల్లోనున్న ఎన్నికల కోడ్ ఈ నెల 14న జరిగే కౌంటింగ్ లో ముగియనున్నందున 25న కౌన్సిల్ నిర్వహించాలని ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నిర్ణయించినట్లు సమాచారం. కౌన్సిల్ మీటింగ్ నిర్వహణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం కార్పొరేటర్ల నుంచి ప్రశ్నలను స్వీకరిస్తున్నారు. మేయర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశం ఈ పాలక మండలి చివరి సమావేశం అయి ఉండవచ్చునని పలువురు పాలక మండలి సభ్యులు వ్యాఖ్యానించారు.
Also Read: GHMC: వచ్చే వార్షిక బడ్జెట్ పై జీహెచ్ఎంసీ ఫోకస్.. ఈసారి జరిగే మార్పులివే..!
బతుకమ్మకు గిన్నీస్ రికార్డు
2021 ఫిబ్రవరిలో కొలువుదీరిన ఈ పాలక మండలి గడువు వచ్చే ఫిబ్రవరి 11వ తేదీతో ముగియనున్నందున ఇదే చివరి సమావేశం కావటంతో ఈ సమావేశంలో గడిచిన అయిదేళ్లలో నగరంలో చేపట్టిన పలు అభివృద్ది పనులపై, పరిపాలన పరంగా తీసుకువచ్చిన సరి కొత్త సంస్కరణలపై అధికార పార్టీ సభ్యులతో పాటు ఇతర పార్టీల వారిగా సభ్యులకు మాట్లాడే అవకాశమిచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. హెచ్ సిటీ పనులు, ఎస్ఆర్ డీపీ పనులు, దశాబ్దాలుగా వివాదంగా ముడిపడి ఉన్న ప్రధాన కార్యాలయంలో పరిష్కారమైన విగ్రహాల పంచాయతీతో పాటు స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలు, ఇటీవల ప్రారంభించిన ఇందిరమ్మ బ్రేక్ ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈ సారి బతుకమ్మకు గిన్నీస్ రికార్డు ఆఫ్ వరల్డ్ లో స్థానం దక్కటం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
బడ్జెట్ రూ. 10 వేల కోట్లు
దీంతో పాటు రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27) కు సంబంధించిన వార్షిక బడ్జెట్ పై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సారి బడ్జెట్ రూ. 10 వేల కోట్లు దాటే అవకాశమున్నందున, బడ్జెట్ రూపకల్పనకు సంబంధించి అన్ని పార్టీల సభ్యుల అభిప్రాయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మున్సిపల్ యాక్టు 1959 ప్రకారం నవంబర్ 10 లోపు స్టాండింగ్ కమిటీ, డిసెంబర్ 10 లోపు బడ్జెట్ ను ఆమోదించి తదుపరి ఆమోదం కోసం సర్కారుకు పంపాల్సి ఉన్నందున ఈ నెల 25న జరగనున్న కౌన్సిల్ సమావేశంలో బడ్జెట్ కు కూడా ఆమోదం తెలిపే అవకాశాల్లేకపోలేవు. ఇక మజ్లీస్, బీజేపీ పార్టీలు మాత్రం ఎప్పటిలాగే ప్రజా సమస్యలైన శానిటేషన్, దోమలు, కుక్కల బెడద, స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్, రోడ్ల నిర్వహణ, నాలాలు, వరద నీటి కాలువల నిర్వహణ వంటి అంశాలను ప్రస్తావించేలా ప్రశ్నలు సమర్పిస్తున్నట్లు తెలిసింది.
21న స్టాండింగ్ కమిటీ
జీహెచ్ఎంసీ చేపట్టే ప్రతి అభివృద్ది పనితో పాటు పరిపాలనపరంగా తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ ఈ నెల 21న సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు అభివృద్ది పనులు, మెయింటనెన్స్ పనులతో పాటు పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ వంటి అంశాలతో కూడా అజెండాను అధికారులు సిద్దం చేస్తున్నట్లు సమాచారం. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త అభివృద్ది ప్రతిపాదనలతో పాటు పలు మెయింటనెన్స్ ప్రతిపాదలకు తోడు స్టాండింగ్ కమిటీలో రానున్న కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రస్తావన కూడా వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. బడ్జెట్ లో వివిధ విభాగాలకు జరిపిన కేటాయింపులు ప్రస్తావనకు వచ్చి, స్వల్పంగా మార్పులు జరిగే అవకాశమున్నట్లు తెలిసింది.
Also Read: GHMC: మూలనపడేసిన కార్లపై జీహెచ్ఎంసీ నజర్.. దుండిగల్ యార్డుకు తరలించే యోచన!
