Ind Vs Pak: ఆసియా కప్-2025లో భాగంగా సెప్టెంబర్ 14న జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు తీవ్ర (Ind Vs Pak) నిరాశకు లోనైంది. ఇక, మ్యాచ్ అనంతరం హ్యాండ్‌షేక్ జరగకపోవడంతో అవమానభారంగా కూడా భావించింది. దీంతో, ఆదివారం (సెప్టెంబర్ 21) జరిగే సూపర్-4 మ్యాచ్ నేపథ్యంలో ఆ జట్టు ప్లేయర్లు బాగా టెన్షన్ పడుతున్నారని సమాచారం. ఢీకొట్టబోయే జట్టు భారత్ కావడంతో పాక్ ఆటగాళ్లు ఒత్తిడిలో కనిపిస్తున్నారు. దీంతో, ప్లేయర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే లక్ష్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కీలక చర్యకు ఉపక్రమించింది.
ఆటగాళ్లలో ధైర్యాన్ని నింపేందుకు ఒక మోటివేషనల్ స్పీకర్‌ను పీసీబీ నియమించింది. పాకిస్థాన్ టీమ్ మానసిక స్థైర్యాన్ని ప్రోత్సాహించేందుకు డా.రహీల్ కరీమ్ అనే ప్రముఖ మానసిక వికాస నిపుణుడిని రంగంలోకి దించింది. ఆయన ఇప్పటికే జట్టుతో కలిశారు. డా. రహీల్ గత దశాబ్దకాలంగా వివిధ క్రీడలకు చెందిన ఆటగాళ్లకు ప్రత్యేక క్లాసులు ఇచ్చారు. ఇప్పటికే చాలా జట్లతో ఆయన పని చేశారు. డా.రహీల్ ఇప్పటికే పాక్ టీమ్‌తో కలిశారని, టోర్నమెంట్ ముగిసే వరకు ఆయన జట్టుతోనే ఉంటారని పీసీబీ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపినట్టు ‘టెలికమ్ ఏసియా స్పోర్ట్’ కథనం పేర్కొంది.
భారత్‌తో జరిగే మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ జట్టు ఒత్తిడిని తట్టుకోలేకపోతోందన్న భావన పీసీబీ పెద్దల్లో ఉందని, ముఖ్యంగా ఆసక్తి ఎక్కువగా ఉన్న మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు బాగా టెన్షన్ పడుతున్నారన్న భావన పీసీబీ పెద్దల్లో ఉందని సమాచారం. మరి, మోటివేషనల్ స్పీకర్‌ను నియమించుకున్న తర్వాతైనా పాకిస్థాన్ తలరాత మారుతుందో లేదో చూడాలి.
ఇదిలావుంచితే, సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా లీగ్ దశ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ సునాయాస విజయం సాధించింది. టీమిండియా ఏకంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీ20ల్లో పాకిస్థాన్‌పై గత 14 14 మ్యాచుల్లో భారత్ సాధించిన 11వ విజయం కావడం గమనార్హం. లీగ్ మ్యాచ్ ఓటమిని మరిచిపోయి, సూపర్-4లో భారత్‌ను ఎలాగైనా ఓడించాలని భావిస్తోంది. సూపర్-4తో సరిపెట్టుకోకుండా టోర్నమెంట్‌ను గెలవాలని యోచిస్తోంది. అందుకే, ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్‌ను అత్యంత కీలకమైనదిగా పాక్ టీమ్ చూస్తోంది.
Read Also- GHMC: సెకండ్ లెవెల్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ల ఏర్పాటుకు బల్దియా కసరత్తు.. 36 స్థలాల గుర్తింపు
అందుకే, ప్లేయర్లు ఒత్తిడిలోకి జారుకోకుండా, వారిలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు పాకిస్థాన్ టీమ్ మేనేజ్‌మెంట్ తాపత్రయ పడుతోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే మోటివేషనల్ స్పీకర్‌ను పీసీబీ నియమించింది. ఇదిలావుంచితే, మ్యాచ్‌కు ముందు రోజు అయిన శనివారం సాయంత్రం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను పాకిస్థాన్ టీమ్ రద్దు చేసింది. గతవారం భారత్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత ‘నో హ్యాండ్‌షేక్ వివాదం’, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై చర్యలు లేకపోవడానికి సంబంధించిన అంశాలపై మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.