Strange Heist: అమెరికాలోని ఫ్లోరిడా పోలీసులు ఒక వింత దొంగ కోసం వెతుకుతున్నారు. సాధారణంగా దొంగలు ముఖాలకు మాస్క్ ధరించి చోరీలకు పాల్పడుతుంటారు. కానీ ఫ్లోరిడా పోలీసులు వెతికే దొంగ మాత్రం ఇందుకు భిన్నం. సముద్ర గర్భంలో అన్వేషణకు ఉపయోగించే స్కూబా డైవింగ్ సూట్ ను ధరించి దొంగతనం చేశాడు. ఒర్లాండోలోని డిస్నీ స్ప్రింగ్స్‌లో ఉన్న పాడిల్‌ఫిష్ అనే రెస్టారెంట్‌లో అతడు ఈ దోపిడి చేశాడు.
దోపిడి ఎలా జరిగిందంటే?
సోమవారం (సెప్టెంబర్ 15) అర్థరాత్రి.. రెస్టారెంట్ మూసి ఉన్న సమయంలో దొంగ లోపలికి ప్రవేశించాడు. కేవలం 2 నిమిషాల్లోనే డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. అయితే రెస్టారెంట్ స్టాఫ్ ఎవరూ గాయపడలేదని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. అయితే దొంగతనానికి గురైన రెస్టారెంట్ ఓ సరస్సుకు దగ్గరలో ఉండటం గమనార్హం.
ఎంత దోచుకున్నాడంటే?
రేర్ అనే మీడియా రిపోర్ట్ ప్రకారం.. దొంగ స్కూబా డ్రెస్ వేసుకుని పడవలో వచ్చాడు. బోట్ ను గేర్ లోనే ఉంచి మేనేజర్ ఆఫీసులోకి వెళ్లాడు. అప్పటికి డబ్బు లెక్కపెడుతున్న ఉద్యోగులను కళ్లుమూయమని చెప్పి.. వారి చేతులు కట్టేశాడు. కానీ ఎలాంటి ఆయుధాలతో బెదిరించలేదు. అతను 10,000 – 20,000 డాలర్ల వరకు దొంగిలించి కొన్ని నిమిషాల్లోనే పారిపోయాడు.
దొంగ ఎలా ఉన్నాడంటే
పోలీసులు విడుదల చేసిన ఫోటోలో ఆ వ్యక్తి గాగుల్స్, వెట్‌సూట్, గ్లౌవ్స్, స్కూబా హుడ్ ధరించి ఉన్నాడు. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. అతను నీలి టోపీ, శరీరానికి అతికినట్టుగా ఉన్న నీలి దుస్తులు కూడా వేసుకున్నాడు.
ఆధారాలు చెరిపేసిన దొంగ
దొంగ పారిపోవడానికి ముందు సెక్యూరిటీ కెమెరాపై స్ప్రే పెయింట్ పిచికారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనం చేసిన డబ్బుతో అతను మళ్లీ ఈత కొట్టి వెళ్లిపోయాడని భావిస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: చిత్రపరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్తా.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా
ముమ్మర గాలింపు..
ప్రస్తుతం ఆ దొంగ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు ఫ్లోరిడా పోలీసులు తెలిపారు. ఎవరికైనా సమాచారం ఉంటే చెప్పాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దోపిడికి గురైన పాడిల్‌ఫిష్ రెస్టారెంట్ మాత్రం ఈ ఘటన గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. మరుసటి రోజు సాధారణంగానే రెస్టారెంట్ తెరిచిన నిర్వాహకులు.. కస్టమర్లకు ఫుడ్ అందిస్తున్నారు.
Also Read: Shocking Incident: ఇండియన్ తాత.. అమెరికా బామ్మ.. విస్తుపోయే క్రైమ్ కథా చిత్రం!
స్థానికుల రియాక్షన్..
స్థానికులు ఈ దోపిడీని విని ఆశ్చర్యపోతున్నారు. ‘ఇది పిచ్చి పనే. ఇలాంటి వాడిని ఎక్కడ వెతుకుతారు’ అని జీన్ రోస్ అనే మహిళ వ్యాఖ్యానించారు. అయితే స్కూబా డ్రెస్ లో దొంగతనం చేయడం గురించి తొలిసారి వింటున్నట్లు మరికొందరు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పాడిల్‌ఫిష్ డిస్నీ స్ప్రింగ్స్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటి. ఇది 2017లో ప్రారంభమైంది. లాబ్‌స్టర్ కార్న్ డాగ్స్, క్రాబ్ ఫ్రైస్, వాటర్ వ్యూస్‌తో రూఫ్‌టాప్ బార్ కోసం ప్రసిద్ధి చెందింది.