Black Jaggery: మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం కావడంతో ఇక్కడ కొంత గుడుంబా తయారు చేసుకుని గిరిజనులు సేవించే అవకాశం ఉంది. ఇది గిరిజన ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు తయారీకి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇక్కడే అసలు దెబ్బ పడుతుంది. అమాయక గిరిజనులను ఆసర చేసుకొని నల్ల బెల్లం(Black jaggery) వ్యాపారం చేయడంలో కొంతమంది అక్రమార్కులు ఆరితేరారు. వారిపై ఎన్ని కేసులు పెట్టిన వారి తీరులో మార్పు రావడం లేదు. ఓవైపు ఎక్సైజ్ పోలీసులు, మరోవైపు సివిల్ పోలీసులు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న మా రూటే సపరేటు అంటూ అక్రమార్కులు వారికి కావాల్సిన అవినీతి అధికారులను వెతుక్కోని ఈ దందాను కొనసాగిస్తుండడం గమనార్హం. గత జనవరి నుంచి నేటి వరకు జరిగిన కేసుల వివరాలు చూస్తే మహబూబాబాద్ జిల్లాలో ఏ విధంగా నల్లబెల్లం రవాణా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
జనవరి నుంచి సెప్టెంబర్ వరకు
2025 జనవరి నుంచి సెప్టెంబర్ 15 వరకు జిల్లావ్యాప్తంగా 1431 మందిపై 1230 కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి 6776 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 90 వేల ఆరు వందల పది లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. 99 క్వింటాళ్ల 45 కేజీల నల్లబెల్లాని సైతం స్వాధీనం చేసుకొని 354 సంబంధిత వ్యాపారుల వాహనాలను సీజ్ చేశారు.
Also Read: Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే?
1142 మంది బైండ్ ఓవర్లు 65 మందిపై బ్రీచ్ కేసులు
1142 మందిని స్థానిక తహసిల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. ఇందులో మళ్లీ మళ్లీ గుడుంబా తయారీ చేస్తున్న, నల్ల బెల్లం రవాణా చేస్తున్న వారిపై ఎక్సైజ్ పోలీసులు 65 మంది పై బ్రీచ్ కేసులు నమోదు చేశారు. బ్రిడ్జ్ కేసుల్లో 17.50 లక్షల జరిమానాను సైతం విధించారు. అయినప్పటికీ నల్ల బెల్లం వ్యాపార అక్రమార్కుల్లో మాత్రం తీరు మారలేదు. అంతేకాకుండా పోలీస్(Police) శాఖలో పనిచేస్తున్న కొంతమంది అవినీతి అధికారుల ఆసరాతో నల్లబెల్లం రవాణాను కొనసాగిస్తున్నారు.
ఏసీబీకి చిక్కిన సీఐ
ఇలా వ్యాపారం చేస్తున్న అక్రమార్కులు కొంతమంది పోలీసు శాఖలో పనిచేస్తున్న అవినీతి అధికారుల అండదండలతో నల్లబెల్లం వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇటీవలనే డోర్నకల్ సీఐ రాజేష్ కుమార్(CI Rajesh Kumar) ఓ అక్రమ నల్ల బెల్లం వ్యాపారి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇలాంటి అధికారులు ఇంకా పోలీస్ శాఖలో ఉన్నారని చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా చూస్తే మహబూబాబాద్ జిల్లాలో అక్రమ నల్లబెల్లం వ్యాపారులకు అండదండలు అందించినంత కాలం ఇక్కడ గుడుంబాను నివారించడం సాధ్యం కాదని ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు మద్యం విక్రయాలు కొనసాగించాలని, మరోవైపు నల్ల బెల్లాన్ని అరికట్టి గుడుంబా తయారీని సైతం నిలిపివేయాలని లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.
Also Read: CM Revanth Reddy: వీధుల్లో ఎల్ఈడీ లైట్లపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు