Mynampally Rohit Rao Protest: పేదలకు ఉపాధి కల్పించాలనే మంచి ఉద్దేశ్యం తో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో యూపిఏ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. అలాంటి పథకాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. పీసీసీ పిలుపు నేపథ్యంలో గురువారం మెదక్ కలెక్టరేట్ వద్ద ఎమ్మెల్యే రోహిత్ రావు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పేరు మార్చడమంటే పేదల పొట్ట కొట్టడమేనని మండిపడ్డారు.
పథకం అమల్లోనూ మార్పు
పథకం పేరుతో పాటు దాని ఆత్మ, అమలు విధానాన్ని సైతం మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్నట్లు మైనంపల్లి రోహిత్ రావు మండిపడ్డారు. గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే మహాత్మా గాంధీ ఆలోచనలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. పేదలు, రాష్ట్రాలను శిక్షించేలా కేంద్రం విధానం ఉందని విమర్శించారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి భద్రత కల్పించడం, వలసలను తగ్గించడం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిని సాధించడం లాంటి గొప్ప లక్ష్యాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని రోహిత్ రావు గుర్తుచేశారు.
ఇది చాలా అన్యాయం
గతంలో వందశాతం నిధులు వెచ్చిస్తూ పథకాన్ని అమలు చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తన వాటాను 60 శాతానికి తగ్గించి మిగిలిన 40శాతం భారాన్ని రాష్ట్రాలపై మోపబోతోందని మెదక్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది చాలా అన్యాయమని మండిపడ్డారు. ఇది రాష్ట్రాల ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమని అన్నారు. కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి నిధులు కేంద్రమే కేటాయించాలని మెదక్ ఎమ్మెల్యే పట్టుబట్టారు.
Also Read: Bigg Boss9 Telugu: డీమాన్ పవన్‌కు బిగ్ బాస్ ఇచ్చిన హైప్ మామూలుగా లేదుగా.. కానీ సామాన్యుడిగా వచ్చి..
కూలిని రూ.600కి పెంచాలి
ఉపాధి హామీ పథకం దేశంలోని 30 కోట్ల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఉపాధి కల్పిస్తోందని మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. పని దినాలను పెంచామని చెబుతూ కూలీల సంఖ్య పెద్ద ఎత్తున కుదించడం సరికాదన్నారు. ఇప్పుడున్న చట్టంలో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం నిధులు విడుదల చేస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ పనులు ఉన్న సమయంలో 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులను ఆపటం వల్ల కూలీలు పనికోల్పోయే అవకాశం ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పని దినాలను 200కి పెంచాలనీ, రోజువారి కూలిని రూ.307 నుంచి రూ.600 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.

