CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలపై (Panchayat elections) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గురువారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, 7,527 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో 808 మంది రెబల్స్ ఈ ఎన్నికల్లో గెలిచారని పేర్కొన్నారు. మొత్తంగా 8,335 గ్రామ పంచాయతీలను, అంటే 66 శాతం ఫలితాలను హస్తం పార్టీ, తమ పార్టీ రెబల్స్ సాధించారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
బీఆర్ఎస్-బీజేపీ కూటమి
ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ – బీజేపీ ఒక కూటమిగా పోటీ చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి పంచ్‌లు పేల్చారు. 3,511 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్, 710 గ్రామపంచాయతీలను బీజేపీ గెలిచాయని చెప్పారు. మొత్తంగా 4,221 గ్రామపంచాయతీలను బీఆర్ఎస్-బీజేపీల కూటమి గెలుచుకుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ కూటమి 33 శాతం స్థానాలను గెలుచుకుందన్నారు. దాదాపు 146 గ్రామ పంచాయతీలను సీపీఐ, సీపీఎం, ఇతరులు గెలుచుకున్నారని అన్నారు. ఈ ఫలితాలు తమ ప్రభుత్వ రెండు సంవత్సరాల పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు అని వ్యాఖ్యానించారు.
Read Also- Bigg Boss9 Telugu: డీమాన్ పవన్‌కు బిగ్ బాస్ ఇచ్చిన హైప్ మామూలుగా లేదుగా.. కానీ సామాన్యుడిగా వచ్చి..
కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు
రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకుగానూ, 12,702 స్థానాలకు ఎన్నికలు జరిగాయన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా, ప్రజాస్వామ్యంగా, లోపాలు లేకుండా నిర్వహించిన అధికారులు, సిబ్బంది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలు, ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ప్రజా ప్రభుత్వం పాలన చేపట్టి డిసెంబర్ 7, 2025 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని సంబరాలు జరుపుకుంది. అంతేకాదు, మూడ విడతలుగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. ఇందుకు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ప్రభుత్వంపై సంపూర్ణ విశ్వాసంతో ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నాను. వివిధ రకాల విశ్లేషణలు, పత్రికల్లో ప్రకటనలు రాజకీయ నాయకులు, వాళ్ల వాళ్ల పార్టీలకు సంబంధించిన వివరాలను అన్వయించారన్నారు. కానీ, మాకు అందిన ఫలితాల సమాచారం తెలియజేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రకారం మీడియా సమావేశం ఏర్పాటు చేశాం’’ అని రేవంత్ రెడ్డి వివరించారు.
కేసీఆర్‌కు రేవంత్ సవాలు
‘‘కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో ఉండగానే ఆయన్ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. కేసీఆర్‌కు సూటిగా సవాల్ విసురుతున్నా. ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమనండి. కృష్ణా జలాలపై ఎవరు అన్యాయం చేశారో చర్చకు సిద్ధం. ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాం.
గోదావరి, కృష్ణా జలాలపై సభలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో కంటే పదేళ్లలో తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్, కేసీఆర్. గోదావరి, కృష్ణా జలాలపై వారు చేసిన ద్రోహం ఆధారాలతో సహా నిరూపిస్తాం. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రజాస్వామ్య బద్ధంగా అసెంబ్లీలో చర్చ చేసి ముందుకు వెళతాం’’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం
‘‘మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర బీజేపీ చేస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యం. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కొందరికి ఇంకా అహంకారం తగ్గలేదు. మూసీలో కాలుష్యం కంటే ఒకాయన కడుపులో ఎక్కువ విషం కనిపిస్తోంది. ఈ ఫలితాలు చూసే అద్భుతం అని కొందరు జబ్బలు చరుచుకుంటున్నారు. 2029లో కూడా ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయి. 2/3 మెజారిటీతో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మీ కోపంతో, అసూయతో ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకోవద్దు. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం’’ అని అన్నారు.
ఉపఎన్నికల్లోనూ పట్టం
కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘94 శాసనసభ నియోజవర్గాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరిగితే 87 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక ఫలితాలు సాధించింది. బీఆర్ఎస్ 6 నియోజవర్గాల్లో , బీజేపీ 1 నియోజకవర్గంలో అత్యధిక ఫలితాలు సాధించాయి. పేదలకు మేం అందించిన సన్నబియ్యం, ఉచిత కరెంటు, సన్న వడ్లకు బోనస్, రూ.500 లకే సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన ఇతర పథకాలతో ప్రజలు మమ్మల్ని ఆదరించారు. ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారెంటీగా ప్రజలకు స్వేచ్ఛను అందించాం. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిపించాం. హోదాలను అడ్డుపెట్టుకుని ఎన్నికలను ప్రభావితం చేసేలా మేం నిర్ణయం తీసుకోలేదు. గెలిస్తే కళ్లు నెత్తికెక్కినట్లుగా మేం ఏనాడు వ్యవహరించలేదు’’ అని రేవంత్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు మరింత బాధ్యతను పెంచాయని అన్నారు.

