Ponnam Prabhakar: హుస్నాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ ఫలితాలపై మంత్రి పొన్నం హర్షం
171 గ్రామ పంచాయతీలకు 119 మంది కాంగ్రెస్ సర్పంచులు గెలుపు
స్వతంత్రులు కూడా పార్టీలోకి వస్తున్నారు
నూతన సర్పంచ్‌లను సన్మానించి, అభినందించిన పొన్నం ప్రభాకర్
అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయాలని సూచన
పల్లెల్లో 80 శాతం పోలింగ్ ప్రజాస్వామ్యంపై గ్రామీణ ప్రజల నమ్మకానికి నిదర్శనం
నగరంలో 50 శాతం దాటని పోలింగ్
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్‌లో జరిగిన ఎన్నికల్లో సినీ యాక్టర్లు, మొత్తం అధికార యంత్రాంగం కదిలినా అక్కడ 50 శాతం కూడా పోలింగ్ నమోదు కాలేదని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజాస్వామ్యం మీద విశ్వాసంతో పెద్ద ఎత్తున 80 శాతానికి పైగా ఓటింగ్ లో పాల్గొనడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అభినందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. నూతనంగా గెలిచిన కాంగ్రెస్ సర్పంచులు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తన పక్షాన, ముఖ్యమంత్రి పక్షాన, పీసీసీ పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో 11 మంది ఇండిపెండెంట్‌లు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని మంత్రి పొన్నం తెలిపారు. వారిని ప్రశంసించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 171 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే, కాంగ్రెస్ పార్టీ నుంచి 108 మంది గెలిచారని వెల్లడించారు. స్వతంత్ర సర్పంచ్‌ల చేరికతో కాంగ్రెస్ సర్పంచ్‌ల సంఖ్య 119 మందికి పెరిగిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితో సర్పంచులు విజయం సాధించారని మెచ్చుకున్నారు. ప్రజా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించారని అభివర్ణించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 80 శాతానికి పైగా పోలింగ్ జరిగిన గ్రామాలకు ఆయన అభినందనలు తెలిపారు. గ్రామాల్లో వృద్ధులు ఓటు వేస్తేనే ఉన్నట్టు, లేకపోతే లేనట్టు అనే విధంగా వ్యవహరించడంతోనే పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందని ప్రశంసించారు.
Read Also- YS Jagan Mass Warning: అధికారంలోకి రాగానే.. వాళ్లని జైల్లో పెడతాం.. జగన్ మాస్ వార్నింగ్
ప్రజా సమస్యలపై గెలిచిన స్థానిక సర్పంచులు వారి స్థాయిలోని సమస్యలను పరిష్కారం చేసే విధంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, శివయ్య, కంది తిరుపతిరెడ్డి, చందు, పద్మ రవీందర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు రాజు, భూక్య సరోజ, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రజిత, వెంకటరమణ, శ్రీనివాస్, శ్రీధర్, రమేష్, బోనగిరి రజిత కృష్ణయ్య ,పి నరసాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ అక్కన్నపేట కోహెడ సైదాపూర్ మండలాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉపసర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లను శాలువాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు.

