YS Jagan Mass Warning: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విపక్ష వైసీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం విజయవంతమైనట్లు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. మెుత్తం కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేసినట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం ప్రజా ఆస్తులను ప్రైవేటుకు అప్పగిస్తూ వ్యవస్థలను కుప్పకూలుస్తోందని జగన్ మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ ప్రైవేటీకరణ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటామన్నారు. దీనికి కారకులైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. తద్వారా చంద్రాబాబుకు గుణపాఠం చెబుతామని జగన్ అన్నారు.
గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం
మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ చేతుల్లో పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారని వైఎస్ జగన్ అన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ కోటీ నాలుకు లక్షల మంది సంతకాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రతులను పార్టీ నేతలతో కలిసి సాయంత్రం లోక్ భవన్ లో గవర్నర్ కు అందజేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఇప్పటికే లోక్ భవన్ కు ప్రతులు చేరుకున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా సంతకం చేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని జగన్ పేర్కొన్నారు.
కోర్టులో అఫిడవిట్ వేస్తాం
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్ అంటూ జగన్ ఆరోపించారు. ప్రైవేటు వాళ్లకు మెడికల్ కాలేజీలు అప్పగించడమే కాకుండా అందులో పనిచేసే వారికి జీతాలు కూడా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైందని ఆరోపించారు. ఒక్కో కాలేజీకి జీతాల కింద రూ.120 కోట్లు ప్రభుత్వం అందించనున్నట్లు తెలిపారు. ఇంత కంటే పెద్ద స్కామ్ ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటానికి సైతం దిగనున్నట్లు జగన్ పేర్కొన్నారు. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులను జైలుకు పంపి.. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతామని జగన్ స్పష్టం చేశారు.
Also Read: Gandhi Bhavan: హైదరాబాద్‌లో హై అలర్ట్.. టీపీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్‌కు.. పోలీసుల ఝలక్!
‘చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది’
రాష్ట్రంలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని చంద్రబాబే బహిర్గతం చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి సర్కార్ ఇప్పటివరకూ రెండు బడ్జెట్ లు ప్రవేశపెట్టినా ప్రజలకు మంచి జరగలేదని అన్నారు. సూపర్ – 6, సూపర్ – 7 పేరుతో అన్ని మోసాలే చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు తిరోగమనంలో ఉన్నట్లు చెప్పారు. తన అసమర్థతను అధికారులపైకి చంద్రబాబు నెడుతున్నారని జగన్ ఆరోపించారు. అధికారుల పనితీరు వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నట్లు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు అంటున్నారని గుర్తుచేశారు. ఈ మాటలు వింటే ఏం అనాలో కూడా తనకు అర్థం కావడం లేదని జగన్ చెప్పుకొచ్చారు.

