Hyderabad CP Sajjanar: బెంగళూరులో జరిగిన అమానవీయ ఘటన ప్రతీ ఒక్కరినీ కలిచివేసిన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై ప్రాణపాయ స్థితిలో ఉన్న భర్తను కాపాడుకునేందుకు ఓ భార్య పడిన ఆరాటం ప్రతీ ఒక్కరినీ కదిలించింది. అదే సమయంలో ఆపదలో ఉన్న మనిషిని కాపాడలేని కొందరి దుర్మార్గపు వైఖరిని సైతం బహిర్గతం చేసింది. అయితే తన భర్తను కాపాడేందుకు ఎవరూ ముందుకు రానప్పటికీ సదరు మహిళ గొప్ప మనసు చాటుకోవడంపై హైదరాబాద్ సిటీ కమీషనర్ వీసీ సజ్జనార్ (V.C. Sajjanar) ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
సీపీ సజ్జనార్ ఏమన్నారంటే?
గుండెపోటుతో నడిరోడ్డుపై చనిపోయిన భర్త వెంకట రమణన్ (34) కళ్లను అతడి భార్య రూప దానం చేశారు. దీనిపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘కళ్లుండి కూడా తన బాధను చూడలేని లోకానికి.. తన భర్త కళ్లతోనే ‘చూపు’నిచ్చింది’ అని సజ్జనార్ ప్రశంసించారు. ‘నడిరోడ్డుపై భర్త ప్రాణాల కోసం ఆమె పడ్డ తపనను, ఆ కన్నీటిని చూసేందుకు ఈ సమాజానికి కళ్లు చాలలేదు.. మనసు రాలేదు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని ఈ ‘గుడ్డి’ సమాజంపై ఆమె పగ పెంచుకోలేదు. కళ్లున్నా గుడ్డిలా ప్రవర్తించిన లోకానికి తన భర్త కళ్లను దానం చేసి మానవత్వపు వెలుగును పంచింది. సాయం చేయడానికి చేతులు రాని చోట చూపునిచ్చిన రూపా గారి సంస్కారానికి శిరస్సు వంచి నమస్కరిద్దాం. ఆమె నుంచి సాటి మనిషికి సాయపడటం నేర్చుకుందాం’ అంటూ సజ్జనార్ తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.
కళ్లుండి కూడా తన బాధను చూడలేని లోకానికి.. తన భర్త కళ్లతోనే 'చూపు'నిచ్చింది!🙏
నడిరోడ్డుపై భర్త ప్రాణాల కోసం ఆమె పడ్డ తపనను, ఆ కన్నీటిని చూసేందుకు ఈ సమాజానికి కళ్లు చాలలేదు.. మనసు రాలేదు.
ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోలేని ఈ 'గుడ్డి' సమాజంపై ఆమె పగ పెంచుకోలేదు. కళ్లున్నా గుడ్డిలా… pic.twitter.com/hLp3Yp0gnc
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 18, 2025
అసలేం జరిగిందంటే?
ఈ అమానవీయ ఘటన డిసెంబర్ 13న బనశంకరిలోని కదిరేనహళ్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. భార్య రూపతో కలిసి బైక్ పై వెళ్తున్న భర్త వెంకట రమణన్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. రోడ్డుపై వెళ్తూ కిందపడిపోయారు. దీంతో భర్తను కాపాడుకునేందుకు అతడి భార్య రూప ఎంతగానో శ్రమించింది. రోడ్డుపై వెళ్తున్న వారిని ఆపి తన భర్తకు సాయం చేయాలని ప్రార్థించింది. అంబులెన్స్ కు కాల్ చేయాలని వేడుకుంది. కానీ ఆమె మెురను ఎవరూ పట్టించుకోలేదు. ఆపదలో ఉన్న మనిషికి సాయం చేయాలన్న కనీస బాధ్యతను కూడా నిర్వర్తించలేదు. దీంతో గుండెపోటు వేధిస్తున్నప్పటికీ ఆమె భర్త బైక్ పైనే ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. నొప్పి మరింత తీవ్రతరం కావడంతో మార్గం మధ్యలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు.
Heart wrenching scenes from Bengaluru. Commuters refuse to stop as a woman begs for help after her bike crashed while rushing her husband to the hospital after a heart attack. Several mins later a cab driver stopped, but by the time he was taken to the hospital he was dead. pic.twitter.com/PRisZTVb91
— Deepak Bopanna (@dpkBopanna) December 17, 2025
Also Read: BCCI: నాల్గో టీ20 రద్దు.. నెట్టింట తీవ్ర విమర్శలు.. బీసీసీఐ తప్పు చేసిందా?
భార్య రూప తీవ్ర ఆగ్రహం..
భర్తను కాపాడునే అవకాశం ఉన్నా.. సమాజం నిర్లక్ష్యం కారణంగా అతడ్ని కోల్పోవడంపై భార్య రూప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషుల్లో మానవత్తం మంటగలిసిపోయిందంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తన భర్తను కాపాడేందుకు రోడ్డుపై కనీసం ఒక్కరు ముందుకు వచ్చినా.. తన భర్త ఇప్పుడు ప్రాణాలతో ఉండేవారని రూప కన్నీటి పర్యంతం అయ్యారు. ఇంత జరిగినప్పటికీ సమాజం పట్ల తనకున్న బాధ్యతను ఆమె మర్చిపోలేదు. తన భర్త రెండు కళ్లను దానం చేసి.. అసలైన మనిషి ఏ విధంగా ఉండాలో ఈ లోకానికి రూప చాటి చెప్పారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ సైతం ప్రశంసలు కురిపించడం విశేషం.

