Local Body Elections: గజ్వేల్ గడ్డమీద మరోసారి కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ శాతం విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్(BRS) కంటే ముందు నిలవడం గమనార్హం. కొత్తగా సిద్దిపేట(Sidhipeta) జిల్లా పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కూతురు ఆంక్షా రెడ్డికి గుర్తింపు తెచ్చింది. తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం లోని ఐదు మండలాల్లోని 119 గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 53 సర్పంచ్ పదవులను గెలుచుకొని ముందు నిలిచింది.
బిఆర్ఎస్ బలపరిచిన..
గజ్వేల్ నియోజకవర్గంలోని 9 మండలాల్లో మొదటి విడత ఐదు మండలాల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఒక్క మర్కుక్ మండలంలో బిఆర్ఎస్ ముందుండగా మిగిలిన నాలుగు మండలాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. గజ్వేల్ మండలంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచులు 11 మంది అభ్యర్థులు గెలుపొందగా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 10 మంది, బిజెపి బలపరిచిన అభ్యర్థి ఒక్కరు, స్వతంత్రులు మరో ముగ్గురు సర్పంచ్ పదవులను గెలుచుకున్నారు. వర్గల్ మండలంలో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 9, బిజెపి 3, స్వతంత్రులు 5, జగదేవ్ పూర్ మండలంలో కాంగ్రెస్ 12, బిఆర్ఎస్ 10, బిజెపి 1, స్వతంత్రులు 2, మర్కూక్ మండలంలో కాంగ్రెస్ 6, బిఆర్ఎస్ 9, స్వతంత్రులు ఒకటి, ములుగు మండలంలో కాంగ్రెస్ 14, బిఆర్ఎస్ 10, స్వతంత్రులు ఇద్దరు సర్పంచులు గెలుపొందారు. తూప్రాన్, మనోహరాబాద్, కొండపాక, కుకునూరుపల్లి మండలాలలో సర్పంచ్ ఎన్నికలు జరగవలసి ఉంది.
ప్రముఖుల పరువు అటూ ఇటూ..
సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) నాయకుల సొంత గ్రామాల్లో గెలుపోటములు తీవ్ర ప్రభావం చూపాయి. కెసిఆర్(KCR) దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నరసన్నపేట లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముందే ఏకగ్రీవంగా ఎంపిక కావడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బూరుగుపల్లి ప్రతాపరెడ్డి(Prathap Reddy) సొంత గ్రామం బూరుగుపల్లిలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. మండల కేంద్రాలు మర్కుక్, ములుగు(Mulugu), జగదేవ్ పూర్ సర్పంచులు గెలవడంతో ఆ పార్టీ ముఖ్య నాయకులు కరుణాకర్ రెడ్డి, జహంగీర్, అంజిరెడ్డిలకు కలిసొచ్చినట్లయింది . గజ్వేల్ మండలం లో అమ్మదీపూర్, కొల్గూ రు, శ్రీగిరిపల్లి లలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవడంతో ఆ పార్టీ ముఖ్య నాయకులు మాదాసు శ్రీనివాస్, స్వామి, చంద్రమోహన్ రెడ్డిలకు పరువు నిలిచింది.
పార్టీ బలపరిచిన అభ్యర్థులు
కొడకండ్ల, పిడిచేడ్, సింగాటం, బయ్యారం, దిలార్పూర్ గ్రామాలలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటమికి గురి కావడంతో పండరి రవీందర్ రావు, పంగ మల్లేశం, బెండె మధు, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డిలకు నిరాశ ఎదురయింది. మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి సొంత గ్రామం మండల కేంద్రం వర్గల్ లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమికి గురికాగా నెంటూర్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఓటమికి గురికావడం ఆ పార్టీ మరో ముఖ్య నాయకుడు నిమ్మ రంగారెడ్డికి నిరాశే మిగిలింది. మండల కేంద్రమైన వర్గల్ లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందడంతో ఆ పార్టీ స్థానిక నాయకులకు ఉరుట కలిగింది. ఇంకా పలు గ్రామాల్లో ముఖ్య నాయకులు తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినా మిశ్రమ ఫలితాలు లభించాయి.
Also Read: Mulugu Police: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు.. తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

