Harish Rao: బీఆర్ఎస్ మద్దతు గెలిచిన నూతన సర్పంచ్ లు ప్రజలతో మమేకం కావాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని దిశానిర్దేశం చేశారు. గురువారం మెదక్ లోని బీఆర్ఎస్ ఆఫీసులో నూతనంగా గెలిచిన సర్పంచ్ లతో హరీశ్ రావు సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో పాల్గొని హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సర్పంచ్‌లను బెదిరిస్తే ఊరుకోం..
బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ లకు త్వరలో శిక్షణా తరగతులు నిర్వహించినట్లు హరీశ్ రావు ప్రకటించారు. గ్రామాలకు నిధులు మంజూరు, సేకరణ, అధికారులతో సమన్వయం తదితర అంశాలను సర్పంచ్ లకు వివరిస్తామని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం 15వ ఫైనాన్స్ నిధులు గ్రామ పంచాయతీల కు నేరుగా వస్తాయని హరీశ్ రావు చెప్పారు. కాబట్టి ఎవరికి సర్పంచ్ లు భయపడక్కర్లేదని భరోసా కల్పించారు. సర్పంచ్ లను అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పార్టీ తరపున లీగల్ సెల్ కమిటీలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ లపై ఎవరైనా బెదిరింపులకు దిగితే వడ్డీతో సహా చెల్లిద్దామని నూతన సర్పంచ్ లలో స్థైర్యం నింపారు.
రైతుల పట్ల వివక్ష..
మరోవైపు మెదక్ జిల్లా నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హరీశ్ రావు విరుచుకుపడ్డారు. రైతుల పట్ల వివక్ష చూపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త చట్టాల పేరుతో కౌలు రైతులు, యాజమాన్యాల మధ్య పంచాయతీలు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల మెదక్ జిల్లా రైతాంగం అగమ్య గోచర పరిస్థితిలో ఉందన్నారు. గణపురం ప్రాజక్టు ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని, రైతులకు బోనస్ బకాయిలు రూ. 1800 కోట్లు విడుదల చేయాలని హరీష్ రావు పట్టుబట్టారు.
Also Read: Christmas Dinner: గుడ్ న్యూస్.. ఎల్‌బీ స్టేడియంలో క్రిస్మస్ డిన్నర్.. హాజరుకానున్న సీఎం రేవంత్
‘దొంగనాటకాలు ఆడుతున్నారు’
కేసీఆర్ హాయంలో యూరియా, కరెంటు, రైతుబంధు, పంట కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని హరీశ్ రావు పేర్కొన్నారు. వ్యవసాయానికి నీళ్ళు, కరెంటు ఎరువులు ఇవ్వడం చేతగాక ఈ ప్రభుత్వం యాప్ లు, మ్యాపుల పేరుతో దొంగనాటకాలు ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లు పద్మా దేవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

