ED Summons: అక్రమ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసి దర్యాప్తు సంస్థల ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రికెటర్లు, సినీ ప్రముఖుల జాబితా అంతకంతకూ పెరిగిపోతోంది. అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వ్యవహారంలో తాజాగా పలువురు ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED Summons) నోటీసులు పంపింది. భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పతో పాటు ప్రముఖ నటుడు సోనూ సూద్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. రాబిన్ ఉతప్ప మనీ లాండరింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు ఉండడంతో నోటీసులు అందించారు. ఈ ముగ్గురూ వచ్చే వారం విచారణకు హాజరు కావాలని సమన్లలో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఉతప్ప సోమవారం నాడు, యువరాజ్ సింగ్ మంగళవారం, సోనూ సూద్ బుధవారం విచారణకు రావాలని కోరారు.
బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఇప్పటికే మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, సురేశ్ రైనా, నటి ఊర్వశి రౌతేలా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిమి చక్రవర్తిలను ఇప్పటికే ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. 1ఎక్స్‌బెట్ (1xBet) యాప్ చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌ల స్క్రీనింగ్ సమయంలో విస్తృతంగా ప్రకటనలు ఇచ్చిన ఈ బెట్టింగ్ యాప్.. పన్ను ఎగవేయడంతో పాటు మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. అందుకే ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది.
Read Also- Team India Sponser: డ్రీమ్11 స్థానంలో కొత్త స్పాన్సర్ ఎంపిక.. ఏ కంపెనీయో తెలుసా?
బెట్టింగ్ యాప్‌లు, ప్రముఖలపై ఈడీ దృష్టి
పలు బెట్టింగ్ యాప్‌ల అవకతవకలపై ఈడీ దృష్టిసారించింది. ఈ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీల పాత్రపై, వారు కావాలనే ప్రమోట్ చేశారా, లేక అవగాహనలేక చేశారా అనే కోణంలో ఈడీ అధికారులు వివరాలు రాబడుతున్నారు. ఈ యాప్‌ల కారణంగా ఎంతో వినియోగదారులతో పాటు పెట్టుబడిదారులు కోట్లాది రూపాయలు నష్టపోయారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా 1ఎక్స్‌బెట్ యాప్‌కు భారత్‌లో ప్రచారకర్తగా వ్యవహరించినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర ప్రముఖల విషయానికి వస్తే, బెంగాళీ నటుడు అంకుష్ హజ్రా, తృణమూల్ ఎంపీ మిమి చక్రవర్తి సోమవారమే ఈడీకి స్టేట్‌మెంట్ ఇచ్చారు. శిఖర్ ధవన్‌ను ఈడీ అధికారులు గతవారం ఏకంగా 8 గంటలకు పైగా ప్రశ్నించారు. మరో మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఆగస్టు నెలలోనే విచారణకు హాజరయ్యాడు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ విచారణలు జరుగుతున్నాయి. సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన యాప్‌లు జనాలను ఆకర్షించి, ఆ తర్వాత వారికి నష్టాన్ని చేకూర్చాయనేది సెలబ్రిటీలపై ఆరోపణలుగా ఉన్నాయి.
Read Also- No handshake: సూర్యకుమార్ యాదవ్‌ను ‘పంది’తో పోల్చిన పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం
అక్రమ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారానికి ముందు చట్టపరమైన నిబంధనలు తెలుసుకోలేదా? అని ఈడీ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. ఓ మాజీ క్రికెటర్‌ను ప్రశ్నిస్తూ, 1ఎక్స్‌బెట్ యాప్ ప్రచారానికి తీసుకున్న డబ్బు, ఒప్పంద వివరాలు ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో హర్భజన్ సింగ్‌ను ఈడీ విచారించింది. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసి విచారణ ఎదుర్కొన్న ప్రముఖుల్లో రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి వంటి ప్రముఖలు కూడా ఉన్నారు. జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్365 వంటి యాప్‌లు ఉన్నాయి. ఈ యాప్‌లు భారతీయ చట్టాలకు విరుద్ధమని తెలిసే తెలిసే ప్రచారం చేశారా?, ఒప్పంద సమయంలో యాప్ లైసెన్స్, లీగల్ స్టేటస్ గురించి తెలుసుకున్నారా? అని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.