No handshake: ఆసియా కప్-2025లో మరో ఉత్కంఠభరిత పోరుకు సమయం ఆసన్నమవుతోంది. గ్రూప్-4 దశలో భాగంగా దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ ఆదివారం (సెప్టెంబర్ 21) తలపడబోతున్నాయి. దీంతో, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇతర భారత ఆటగాళ్లపై క్రికెట్ అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది. లీగ్ దశలో భాగంగా ఇరుజట్ల మధ్య గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లకు భారత ప్లేయర్లు హ్యాండ్‌షేక్ (No handshake) ఇవ్వకపోవడం ఇందుకు కారణంగా ఉంది. మ్యాచ్ అనంతరం, సంప్రదాయకంగా ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేస్తుంటారు. కానీ, భారత ఆటగాళ్లు గత మ్యాచ్‌లో ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టడంతో వివాదం చెలరేగింది. ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ టీమ్.. ఈ వ్యవహారంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రధాన వ్యక్తిగా ఉన్నారని, ఆయనను తొలగించకపోతే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామంటూ పీసీబీ హెచ్చరించే వరకు వ్యవహారం వెళ్లింది.
ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్‌ను భారత్ మరోసారి ఢీకొట్టబోతోంది. ఆదివారం (సెప్టెంబర్ 21) జరగనున్న ఈ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు ‘నో హ్యాండ్ షేక్’ పునరావృతం చేస్తారా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే ప్రశ్నను ఓ మీడియా ప్రతినిధి నేరుగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అడిగారు. సూపర్ 4 మ్యాచ్‌లో కూడా ‘నో హ్యాండ్‌షేక్’ చర్యను రిపీట్ చేస్తారా? అని ప్రశ్నించారు.
కెప్టెన్ సూర్య సమాధానం ఇదే
మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న ఏమిటో అర్థం చేసుకున్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా తెలివిగా సమాధానం ఇచ్చాడు. ‘‘బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన గురించే కదా మీరు అడిగేది?. అవును, కచ్చితంగా రిపీట్ చేస్తాం. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై బ్యాటింగ్ మినహా, మిగతా అన్ని అంశాల్లోనూ భారత జట్టు బాగా రాణించింది . రాబోయే మ్యాచ్‌లో కూడా మళ్లీ అదే తరహా ప్రదర్శన చేస్తాం’’ అని సూర్య సమాధానం చెప్పాడు. దీంతో, గత మ్యాచ్‌లో మాదిరిగానే భారత్ ప్లేయర్లు హ్యాండ్ షేక్ ఇవ్వరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఒత్తిడిని ఎలా భరిస్తారు?
పాకిస్థాన్‌తో మ్యాచ్, అందులోనూ ప్రత్యేక భావోద్వేగ సందర్భంలో ఒత్తిడిని ఏవిధంగా నియంత్రించుకుంటారని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు కెప్టెన్ సూర్య ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ‘‘గది తలుపులు మూసివేసి, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి నిద్రపోవడం అత్యుత్తమం. కానీ, చెప్పడానికి ఈజీగా అనిపిస్తుంది, కానీ నిజానికి అంత సులభం కాదు’’ అని సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లకు చాలామంది ఫ్రెండ్స్‌ను కలుస్తుంటారని, బయటకు డిన్నర్‌కు వెళ్తుంటారని అన్నాడు. టీమ్‌లో కొంతమంది ప్లేయర్లకు వీటన్నింటినీ బాగా ఇష్టపడతారు, కాబట్టి పూర్తిగా బయట వాతావరణం నుంచి ఆటగాళ్లను పూర్తిగా దూరంగా ఉంచడం కష్టమేనని సూర్య చెప్పాడు.
కాగా, పాకిస్థాన్‌పై గత మ్యాచ్‌లో సాధించిన విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు, ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న భారత త్రివిధ దళాల సైనికులకు అంకితం చేస్తున్నట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. గత మ్యాచ్‌లో సూర్య చేసిన వ్యాఖ్యలు.. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ నేపథ్యంలో మరోసారి ప్రస్తావనకు వచ్చాయి. కాగా, గత మ్యాచ్‌లో ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. క్రీడా వేదికను రాజకీయ వేదికగా మార్చారంటూపాకిస్థాన్ క్రికెట్ బోర్డు మండిపడింది. ఈ మేరకు ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమైంది.