EAD Policy: అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలకు సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అక్కడ పెద్ద సంఖ్యలో నివసిస్తున్న భారతీయులకు శరాఘాతంగా మారుతున్నాయి. హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఛార్జీల పెంపు, ఇతర కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు, నిబంధనలు ‘అమెరికా కలలు’ కంటున్న భారతీయ యవతలో నైరాశ్యాన్ని నింపుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లూ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు ఆటోమేటిక్‌గా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ రెన్యూవల్ (EAD Policy) జరిగేది. అంటే, ఎలాంటి ప్రక్రియ అవసరం లేకుండానే ఉద్యోగాల పొడిగింపు, లేదా పునరుద్ధరణ జరిగేవి. కానీ, డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తాజాగా ఈ ఆటోమేటిక్ విధానాన్ని మార్చివేసింది. ఇకపై ఆ దేశంలో ఉద్యోగాలు చేసే విదేశీ పౌరుల ఉద్యోగాల పొడిగింపు కోసం రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
ఆటోమేటిక్ పొడిగింపు రద్దు
ఈ నూతన పాలసీ ప్రకారం, ఉద్యోగ అనుమతి పత్రాల (EAD) ఆటోమేటిక్ పొడిగింపు విధానం రద్దు అవుతుంది. అమెరికాలో విదేశీ పౌరులు పని చేయడానికి అవసరమైన చట్టపరమైన అంగీకార పత్రాన్ని ‘ఈఏడీ’ అని వ్యవహారిస్తారు. 2025 అక్టోబర్ 30, లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే విదేశీయులకు ఆటోమేటిక్‌గా ఈఏడీ పొడిగింపు లభించదని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. అమెరికాలో ఉద్యోగం పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకునేవారిని తరచూ తనిఖీ చేయబోతున్నట్టు స్పష్టం చేసింది. పాత రూల్స్ ప్రకారమైతే, ఉద్యోగాల పొడిగింపు అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నప్పటికీ, 540 రోజుల వరకు ఉద్యోగాన్ని కొనసాగించడానికి వీలుండేది. కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం, ఈఏడీ గడువు ముగియడానికి ముందే పునరుద్ధరణకు ఆమోదం లభించాలి. లేదంటే, వెంటనే పని చేయడం ఆపివేయాల్సి ఉంటుందని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది.
భారతీయులపై తీవ్ర ప్రభావం
ట్రంప్ సర్కారు అమల్లోకి తీసుకొచ్చిన ఈ నూతన విధానం అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయ వృత్తి నిపుణులు, వారిపై ఆధారపడే జీవిత భాగస్వాములు, కుటుంబ సభ్యులపై గట్టిగానే ప్రభావం చూపవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. సకాలంలో ఉద్యోగ పునరుద్ధరణకు అనుమతి లభించకపోతే, జాబ్ మానేయాల్సి ఉంటుంది. ఈఏడీ గడువు ముగిసిపోవడానికి 180 రోజుల ముందుగానే పునరుద్ధరణ దరఖాస్తు పెట్టుకోవాలని మార్గదర్శకాల్లో డీహెచ్ఎస్ పేర్కొంది. ఈఏడీ అప్లికేషన్‌ను ఫైల్ చేసే విషయంలో ఎంత ఆలస్యం చేస్తే, అంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. డాక్యుమెంటేషన్‌లో లోపాలు, లేదా ఇతర చిన్నచిన్న విషయాల కారణంగా ఆలస్యం జరిగే ముప్పు ఉంటుంది. కాబట్టి, పునరుద్ధరణ కోసం అప్లై చేసుకునే ఉద్యోగులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంతమంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పటికే గ్రీన్‌కార్డ్ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నవారికి, వీసా సమస్యలు ఎదుర్కొంటున్నవారికి ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త విధానం తలనొప్పులు తీసుకురావొచ్చనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. హెచ్-4 వీసాపై ఆధారపడి వర్క్ పర్మిట్ పొందుతున్న జీవిత భాగస్వాములు, కొన్ని కేటగిరీల విద్యార్థులపై కూడా ప్రభావ చూపనుంది.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				