Jio Gemini AI Pro: కృత్రిమ మేధస్సు (AI) డిజిటల్ విప్లవంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. డయాగ్నస్టిక్స్ సెంటర్ల నుంచి డ్రైవర్‌లెస్ కార్ల వరకు మనుషుల జీవనశైలిని, సృజనాత్మకతలను పునర్నిర్వచించేలా, మనుషుల జీవితంలో ప్రతి అంశాన్నీ ప్రభావితం చేసేలా ఏఐ వేగంగా విస్తరిస్తోంది. ఏఐ సర్వీసులు అందించేందుకు కంపెనీల మధ్య రేసు నెలకొంది. పోటీపడి మరీ మార్కెటింగ్ చేసుకుంటున్నాయి. యూజర్లకు చేరువయ్యేందుకుగానూ వ్యూహాత్మకంగా టెలికం ఆపరేటర్లతో ఏఐ ప్రొడక్టుల కంపెనీలు జట్టు కడుతున్నాయి. ఎయిర్‌టెల్ యూజర్లకు ఉచితంగా సర్వీసులు అందించేందుకు ‘పర్‌ప్లేగ్జిటీ’ ( Perplexity Free) ఇటీవలే భాగస్వామ్యం కుదుర్చుకోగా, తాజాగా ఇండియన్ టెలికం దిగ్గజం రిలయన్స్ జియోతో గూగుల్ కంపెనీ ఒప్పందాన్ని (Jio Gemini AI Pro) కుదుర్చుకుంది. ఈ డీల్‌లో భాగంగా జెమిని ఏఐ (Gemini AI) ప్రో సేవలను జియో యూజర్లకు ఉచితంగా అందించనుంది. ఈ నేపథ్యంలో జియో యూజర్లు పొందనున్న ఏఐ ఫీచర్లు ఏమిటి?, దీనిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?, వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
18 నెలలపాటు ఉచితంగా!
రిలయన్స్ జియో, గూగుల్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, జియో యూజర్లు జెమిని ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను 18 నెలలపాటు ఉచితంగా పొందవచ్చు. సాధారణంగా అయితే, గూగుల్ ఏఐ ప్రో ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ భారతదేశంలో నెలకు రూ.1,950గా ఉంది. కాబట్టి, 18 నెలలపాటు అంటే, ఒక్కో యూజర్‌కు ఏకంగా రూ.35,100 విలువైన సేవలను ఫ్రీగా పొందవచ్చు. ప్రస్తుతానికి 18 – 25 ఏళ్ల మధ్య వయసున్న, అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్స్ వినియోగిస్తున్న యూజర్లతో ఈ సేవలను ప్రారంభిస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే క్రమక్రమంగా ఈ సేవలను దేశవ్యాప్తంగా జియో వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని జియో వివరించింది.
యూజర్లకు ప్రయోజనాలు ఏంటి?
ఉచితంగా జెమినీ ఏఐ ప్రో వినియోగం ద్వారా జియో యూజర్లు కొన్ని అద్భుతమైన ఫీచర్లను పొందవచ్చు. ఫ్రీ వెర్షన్‌లో అందుబాటులో లేని జెమిని 2.5 ప్రో, డీప్ రీసెర్చ్ వంటి ఫీచర్లను జియో యూజర్లు పొందవచ్చు. వియో 3.1 ఫాస్ట్, గూగుల్ వీడియో జనరేషన్ టూల్ వంటి బెనిఫిట్స్ పొందవచ్చు. జెమినీ సైడ్‌బార్ ద్వారా జీమెయిల్, డ్రైవ్, డాక్స్, షీట్స్ వంటి గూగుల్ వర్క్‌స్పేస్ అప్లికేషన్‌లు అనుసంధానం అవుతాయి. తద్వారా యూజర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను ఉపయోగించి తమ డేటా నిర్వహణ, ఏఐ టూల్స్‌తో డేటా క్రియేట్ చేసుకోవడం, మరికొన్ని పనులను ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఇక, నోట్‌బుక్‌ఎల్‌ఎమ్, ఫ్లో (ఏఐ ఫిల్మ్ మేకింగ్ టూల్), విస్క్ (ఇమేజ్‌లను వీడియోలుగా మార్చే ప్లాట్‌ఫామ్) వంటి ఫీచర్లకు కూడా ఉచితంగా యాక్సెస్ ఉంటుంది. అంతేకాదు, ఉచిత సబ్‌స్క్రిప్షన్ సమయంలో గూగుల్ డ్రైవ్, జీమెయిల్, ఫోటోలలో 2 టీబీ (టెరాబైట్) షేర్డ్ స్టోరేజ్‌ను కూడా పొందవచ్చని జియో వెల్లడించింది.
ఇక, జియో అందిస్తున్న సేవలను జెమినీ ఏఐ సహాయంతో స్థానిక భాషల్లో పొందవచ్చు. జియో ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, జియోప్లాట్‌ఫామ్ యాప్‌లలో సేవలను మరింత మెరుగుగా పొందవచ్చు. జియో సినిమా, జియో టీవీ వంటి జియో ప్లాట్‌ఫామ్‌లలో ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని సేవలు సులభంగా మారిపోతాయి. మరోవైపు, విద్య, వైద్య రంగానికి చెందినవారు డిజిటల్ సేవలను మరింత విస్తృతంగా పొందవచ్చు.
ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
గూగుల్ జెమినీ ఏఐ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ‘మై జియో’ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఓపెన్ అవ్వగానే హోం పేజీలో ‘గూగుల్ ఏఐ ప్రో’ బ్యానర్ కనిపిస్తుంది. అక్కడ ‘రిజిస్టర్ ఇంట్రెస్ట్’పై క్లిక్ చేయాలి. ‘థ్యాంక్యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్’ అనే సందేశంతో ఒక పేజీ కనిపిస్తుంది. అంతే, దీంతో, జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. అయితే, జియో, గూగుల్ ఒప్పందానికి సంబంధించిన సేవలు జియో యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు. దశలవారీగా, జియో ప్లాట్‌ఫామ్ యాప్‌లలో (MyJio, JioCinema, JioMart వంటివి) అప్‌డేట్‌ల రూపంలో సేవలు అందబాటులోకి వస్తాయి. ప్రత్యేకించి యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేకుండా జియో యాప్‌లను అప్‌డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి వచ్చే విధంగా మార్పులు చేస్తున్నారు. కాబట్టి, యూజర్లు ‘మై జియో యాప్’ను, ఇతర జియో యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. జియో అధికారిక ప్రకటనల ద్వారా అప్‌డేట్‌లను తెలుసుకోవచ్చు.

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				