Bondi Beach Incident: ఆధునిక ఆస్ట్రేలియా చరిత్రలోనే అతిపెద్ద ఉగ్రదాడి ఇటీవలే సిడ్నీలోని బోండీ బీచ్‌లో (Bondi Beach Incident) జరిగిన విషయం తెలిసిందే. యూదులే టార్గెట్‌గా ఇద్దరు ఉగ్రవాదులు నరమేధం (Terrorist Attack) సృష్టించారు. తుపాకులతో కాల్పులు జరపడంతో 15 మంది మృత్యువాతపడగా, మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు పూర్తవ్వగా, గురువారం నాడు అత్యంత నాటకీయ పరిణామం జరిగింది. సిడ్నీ నగర శివారు ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. భారీగా ఆయుధాలతో రంగంలోకి దిగి, రోడ్డుపై వెళుతున్న రెండు కార్లను మెరుపు వేగంతో అడ్డుకున్నారు. అందులో ఒక కారును ఢీకొట్టి మరీ ఆపారు. రెండు కార్లలోని మొత్తం ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీళ్లంతా బోండీ బీచ్ వైపు వెళుతున్నట్టుగా సిడ్నీ పోలీసులు అనుమానించారు. కాగా, ఘటనా స్థలంలో నిందిత వ్యక్తులందరినీ నేలపై కూర్చోబెట్టి పోలీసులు తుపాకులు పట్టుకొని నిలుచున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Read Also- Bigg Boss9 Telugu: డీమాన్ పవన్‌కు బిగ్ బాస్ ఇచ్చిన హైప్ మామూలుగా లేదుగా.. కానీ సామాన్యుడిగా వచ్చి..
ఒక హింసాత్మక చర్యను అడ్డుకోవడానికి ఈ ఆపరేషన్ చేపట్టామని సిడ్నీ పోలీసులు ప్రకటించారు. కారులో ఉన్న వ్యక్తులు బోండి వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. మెల్బోర్న్ నుంచి బోండి వైపు వెళుతున్న ఒక బృందాన్ని సిడ్నీ శివారులోని లివర్‌పూల్‌లో నిలువరించారని, ఇందుకోసం ‘టాక్టికల్ ఆపరేషన్స్’ అధికారులు రంగంలోకి దిగినట్టు వివరించారు. ఒక వైట్ కలర్ హ్యుందాయ్ హ్యాచ్‌బ్యాక్ కారును ఢీకొట్టి ఆపామని, మరో వాహనాన్ని అడ్డుకున్నామని వివరించారు. జార్జ్ స్ట్రీట్‌లో ఈ ఆపరేషన్ జరిగిందని చెప్పారు. ఒక హింసాత్మక చర్యకు ప్లాన్ వేస్తున్నట్టుగా సమాచారం అందిందని, దీంతో టాక్టికల్ ఆపరేషన్స్ పోలీసులు స్పందించారని చెప్పారు. ఈ ఆపరేషన్ జరిగిన ప్రదేశం నుంచి బోండి బీచ్‌కు వెళ్లడానికి సుమారుగా అరగంట సమయం పడుతుందని తెలిపారు.
విచారణకు సహకరిస్తున్న ఏడుగురు
రెండు కార్లు ఆపివేసి మొత్తం ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సిడ్నీ పోలీసులు వెల్లడించారు. అరెస్టైన వారంతా పోలీసు విచారణకు సహకరిస్తున్నారని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు వెల్లడించారు. బోండీ బీచ్ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోందని, అయితే పట్టుబడిన ఈ ఏడుగురు వ్యక్తులకు ఆ ఘటనతో సంబంధం ఉన్నట్టుగా ఎలాంటి ఆధారాలు లభించలేని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.
మరిన్ని తనిఖీలకు అవకాశం!
బోండీ ఉగ్రదాడి నేపథ్యంలో, ఆస్ట్రేలియా వ్యాప్తంగా పోలీసులు మరిన్ని తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా రానున్న రోజుల్లో న్యూసౌత్ వేల్స్ జాయింట్ కౌంటర్ టెర్రరిజమ్ టీమ్ మరిన్ని సెర్చ్ వారెంట్లు జారీ చేస్తుందని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు కమిషనర్ క్రిస్సీ బర్రెట్ వెల్లడించారు. పరిశీలించాల్సిన మెటీరియల్ చాలా ఉందని, కాబట్టి, దేశానికి చెందిన ఏజెన్సీలు, అలాగే అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి దర్యాప్తు చేపడతామని వివరించారు.

