India – Pakistan: ఈ ఏడాది మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య (India – Pakistan) చోటుచేసుకున్న సైనిక సంఘర్షణకు ముగింపు పడిన విధానంపై పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అసలు నిజాన్ని అంగీకరించారు. భారత్, పాకిస్థాన్‌ల మధ్య సమస్యల విషయంలో ఇండియా ఎప్పుడూ మూడవ పక్షం మధ్యవర్తిత్వానికి అంగీకరించలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘భారత్ ఎప్పుడూ మూడవ పక్షం మధ్యవర్తిత్వానికి ఒప్పుకోలేదు. భారత్‌తో చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నా, ఢిల్లీ ఇప్పటివరకు స్పందించలేదు’’ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘అల్ జజీరా’ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాక్ దార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్‌తో ఏమైనా చర్చలు జరుగుతున్నాయా?, మూడవ పక్షం ఏదైనా కల్పించుకుంటుందా?, మూడవ పక్షం మధ్యవర్తిత్వంపై మీకేమైనా అభ్యంతరం ఉందా?’’ అని ఛానల్ ప్రతినిధి ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఇరుదేశాల మధ్య మూడవ పక్షం మధ్యవర్తిగా ఉండడం విచారించాల్సిన విషయమేమీ కాదని, కానీ భారత్ ఎప్పుడూ ఇది ద్వైపాక్షిక సమస్య అని స్పష్టంగా చెబుతుంటుందని ఇషాక్ దార్ అసలు వాస్తవాన్ని బయటపెట్టారు. ‘‘కచ్చితంగా ద్వైపాక్షిక చర్చలే జరగాలంటూ మేము పట్టుబట్టం. , ఉగ్రవాదం, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలు, జమ్మూకశ్మీర్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో చర్చలు జరగాలి. అన్ని అంశాలపై సమగ్రంగా మాట్లాడుకోవాలి’’ అని ఇషాక్ దార్ చెప్పారు.
అప్పుడు ఏం జరిగిందంటే?
ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇషాక్ దార్ మరిన్ని కీలక విషయాలను వెల్లడించారు. భారత్–పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ కోరుతూ అమెరికా ద్వారా ఒక ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. ఒక స్వతంత్ర ప్రదేశంలో భారత్–పాకిస్థాన్‌లు చర్చలు జరపవచ్చంటూ కూడా సలహా వచ్చిందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను మధ్యవర్తిత్వం వహించినట్టు చెప్పుకుంటున్నారేంటి అని, తాము అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోని ప్రశ్నించామని ఇషాక్ దార్ చెప్పారు. ఆ ప్రశ్నకు రుబియో స్పష్టంగా సమాధానం ఇచ్చాడని, భారత్ ఎప్పుడూ దీనిని ద్వైపాక్షిక సమస్య చూస్తుందని చెప్పారని దార్ గుర్తుచేసుకున్నారు. ఈ ఏడాది జులై 25న వాషింగ్టన్‌లో రుబియోను కలిసినప్పుడు, చర్చల సంగతి ఏమైందని అడిగానని, అప్పుడు కూడా ఇది ద్వైపాక్షిక సమస్య అని భారత్ చెబుతోందంటూ సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. భారత్-పాకిస్థాన్ మధ్య సైనిక ఉద్రిక్తతను తానే ఆపానని, రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధానికి దిగకుండా చూశానని చాలా వేదికల్లో చెప్పారు. ఈ వాదనను భారత్ మొదటి నుంచీ ఖండిస్తూ వస్తోంది. తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ వాదనను ఖండించే విధంగా ఉన్నాయి. దీంతో, ట్రంప్ ముఖచిత్రం ఇప్పుడెలా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది.