Thummala Nageswara Rao: కేంద్ర ప్రాయోజిత పథకాలలో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao:) కోరారు. చిన్న చిన్న పథకాలకు బదులుగా సమన్వయం చేసి సరళీకృతం చేస్తే రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందని సూచించారు. రైతు ఆదాయం పెరగేలా పాలసీలలో మార్పులు తీసుకురావాలని అన్నారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రబీ అభియాన్ – 2025 వ్యవసాయ సదస్సులో పాల్గొని మాట్లాడారు.
విత్తనాల్లో దాదాపు 60 శాతం తెలంగాణ నుండే సరఫరా
తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు పొందిందని, దేశానికి అవసరమయ్యే విత్తనాల్లో దాదాపు 60 శాతం తెలంగాణ నుండే సరఫరా అవుతున్నాయన్నారు.20కుపైగా దేశాలకు విత్తనాల ఎగుమతి జరుగుతోందని వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగులో కూడా రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు సాధించిందని, ప్రస్తుతం 1.5 లక్షల హెక్టార్లలో సాగు జరుగుతుండగా, దీన్ని త్వరలో 8 లక్షల హెక్టార్లకు విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో వరి, పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్, వేరుశెనగ, మిరప, పసుపు, సిరిధాన్యాలు వంటి పంటలు విస్తృతంగా పండుతున్నాయని, అందులో తాండూరు కంది, చాపట మిరప జీఐ గుర్తింపు పొందాయని తెలిపారు.
Also Read: Vande Bharat: హైదరాబాద్ నుంచి మరో రెండు వందే భారత్ రైళ్లు.. ఏయే నగరాలకంటే?
రబీ సీజన్‌లో యూరియా సహా ఎరువుల సరఫరా జరగాలి
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, రైతు బీమా, ఉచిత 24 గంటల విద్యుత్ సరఫరా, పంట రుణమాఫీ, ఇన్‌పుట్ సబ్సిడీలు వంటి పథకాలతో రైతులకు భద్రత, నమ్మకం కల్పించామని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 2,601 రైతు వేదికల ద్వారా రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తూ దాదాపు 13 లక్షల మంది రైతులు, అందులో 3 లక్షల మహిళా రైతులు నేరుగా శాస్త్రవేత్తలు, అధికారులతో సంప్రదింపులు జరిపేలా అవకాశాలు కల్పించామన్నారు. రాష్ట్ర అవసరాల నేపథ్యంలో, రబీ సీజన్‌లో యూరియా సహా ఎరువుల సరఫరా జరగాలని, ఎరువుల కొనుగోలులో ఉన్న 25 శాతం పరిమితిని అన్ని పంటలకూ తొలగించాలని, జొన్న, మొక్కజొన్నలను ప్రైస్ సపోర్ట్ స్కీమ్‌లో చేర్చాలని కేంద్రాన్ని కోరారు. పామాయిల్ పై ప్రస్తుతం ఉన్న సబ్సిడీ 33 శాతం నుంచి 50 శాతానికి పెంచి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించాలని, తెలంగాణ విత్తన రంగానికి జాతీయ గుర్తింపు ఇవ్వాలని, ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందించాలని కోరారు.
తరచుగా సర్వేలు చేయాలి
ఎంజీఎన్ఆర్ఈజీఏలాగానే రైతుల ఆదాయం పెరుగుతోందా లేదా అన్న దానిపై తరచుగా సర్వేలు చేయాలని కోరారు. సబ్సిడీలతో నైట్రోజన్ ఎరువుల వాడకం పెరిగి భూమిలోని పోషకాల అసమతుల్యత పెరుగుతోందని, ఎరువుల ధరలను సవ్యంగా ఉంచి సమతుల్య పోషకాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. సీడ్ చట్టాన్ని పునఃసమీక్షించి నాణ్యత లేని విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలను తీసుకురావాలని కోరారు. పురోగామి విధానాలు, బలమైన పరిశోధన సంబంధాలు, రైతు స్నేహపూర్వక పథకాలు ఉంటే వ్యవసాయం లాభదాయకంగా, బలంగా, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగే రంగంగా మారుతుందన్నారు. కేంద్రం సహకారంతో పాటు జాతీయ స్థాయి సంస్కరణలతో భారత వ్యవసాయాన్ని మరింత సురక్షితంగా మార్చి అందరికీ ఆహార, పోషక భద్రతను అందించవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read:POWERGRID Recruitment 2025: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో భారీ ఉద్యోగాలు..