Vande Bharat: భారతీయ రైల్వేలో వందే భారత్ (Vande Bharat) రైళ్లకు అనతికాలంలోనే ప్రత్యేక స్థానం ఏర్పడింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ రైళ్లు, తక్కువ సమయంలో, మెరుగైన సౌకర్యాలతో, పటిష్టమైన భద్రతతో ప్యాసింజర్ల ప్రయాణాన్ని మరింత సౌలభ్యంగా మార్చేశాయి. అందుకే, ఈ రైళ్ల సంఖ్య పెరగాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. కాగా, హైదరాబాద్ నుంచి రైల్వే ప్రయాణాలు చేసేవారికి త్వరలోనే మరో రెండు కొత్త వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్ నుంచి పుణే, హైదరాబాద్ నుంచి నాందేడ్‌కు వందేభారత్ రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ రైళ్లను రైల్వే శాఖ త్వరలోనే ప్రారంభించబోతోందని ఆయన వెల్లడించారు.
మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో సోమవారం ఆయన ‘వందే భారత్ రైలు’ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి గడ్డం వివేక్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజి రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Read Also- Jogulamba Gadwal: భర్తపై వేడి నూనె పోసిన భార్య.. చికిత్స పొందుతూ మరణించిన భర్త వెంకటేష్
రైల్వే స్టేషన్లను ఎయిర్‌పోర్ట్‌ల స్థాయిలో అభివృద్ధి చేస్తామని, ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తామని బండి సంజయ్ చెప్పారు. ఇందులో భాగంగా ‘అమృత్ భారత్’ పథకం కింద రూ.26 కోట్లు వ్యయంతో మంచిర్యాల రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. రూ.3.5 కోట్లతో స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులపై ఏకంగా రూ.42,000 కోట్లు ఖర్చు పెట్టిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తవించారు. రానున్న పది సంవత్సరాల్లో మరో రూ.80,000 కోట్లు కేటాయించి, 41 పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
Read Also- Diwali Special Trains: దీపావళి స్పెషల్.. ఏకంగా 1,126 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు పండగే!
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిల ఆలస్యం కారణంగా తమ పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో యూరియా విషయంలో కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని నిందిస్తున్నారని, వాస్తవంగా చూస్తే బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారంటూ బండి సంజయ్ ఆరోపించారు. ఖరీఫ్ సీజన్‌లో కేంద్రం పంపించి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 2.05 లక్షల మెట్రిక్ టన్నులు కాంగ్రెస్ నేతలు దారిమళ్లించారని ఆరోపణలు గుప్పించారు. ఈ కారణంగానే రైతులకు యూరియా అందడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, మావోయిస్టులు సరెండర్ కావాలని కోరారు. లేదంటే, ఆపరేషన్‌ను కేంద్రం మరింత గట్టిగా అమలు చేస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వివేక్ మాట్లాడుతూ, ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు వెళ్తుంటారని, అందుకే, కేరళ ఎక్స్‌ప్రెస్‌కు మంచిర్యాల రైల్వే స్టేషన్ స్టాప్ ఉండేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కోరారు. ఎంపీ గడ్డం వంశీ మాట్లాడుతూ, వందే భారత్ రైలుకు మంచిర్యాలలో స్టాపేజ్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.