Hyderabad Police: : నార్త్ జోన్ పోలీసులు వేర్వేరు కేసులకు సంబంధించిన నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి బంగారు నగలతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర మండలం డీసీపీ రష్మీ పెరుమాళ్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పార్సిగుట్ట డెలివరీ బాయ్ జనార్దన్ శిరీష్ (24), కుమ్మరిగూడ ఎలక్ట్రీషియన్ గౌతమ్ కుమార్ (30) స్నేహితులు. వీరు తేలికగా డబ్బు సంపాదించేందుకు కొంతకాలంగా మొబైల్ ఫోన్ల స్నాచింగులకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్నారు. మార్కెట్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్‌ను దోచుకుని ఉడాయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి సెల్ ఫోన్‌ను సీజ్ చేశారు.
Also Read: Mahabubabad Police: గంజాయి, మత్తు పదార్థాల.. నిర్మూలనే పోలీసుల లక్ష్యం!
పట్టపగలే
పట్టపగలే స్నాచింగ్‌కు పాల్పడి పరారీలో ఉన్న నిందితుడిని బేగంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మాయూరి మార్గ్ ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ ఓల్డ్ బేగంపేటలోని తన ఆఫీస్‌కు నడుచుకుంటూ వెళుతుండగా, ఎదురుగా వచ్చిన ఓ దుండగుడు ఆమె మెడలోని 3.7 తులాల మంగళసూత్రాలను తెంచుకుని పారిపోయాడు. వెంటనే దారిన వెళుతున్న ఓ వ్యక్తి 100 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నేరానికి పాల్పడ్డ గుంటూరు జిల్లా కారంచేడుకు చెందిన జొన్నలగడ్డ అశోక్ (27)తో పాటు అతనికి సహకరించిన రామయ్య (27)ను నిమిషాల వ్యవధిలో అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3 లక్షల విలువ చేసే మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
కత్తితో దాడి చేసి
డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి ఆటోతో ఉడాయించిన ఇద్దరిని మహంకాళి పోలీసులు గంటన్నర లోపే అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి వెళుతున్న డ్రైవర్‌ను అడవయ్య చౌరస్తా వద్ద ఇద్దరు వ్యక్తులు ఆపారు. ప్రయాణీకులనుకుని డ్రైవర్ ఆటో ఆపగానే, అతనిపై కత్తితో దాడి చేసి ఆటోతో పరారయ్యారు. బాధితుడు కంట్రోల్ రూంకు ఫోన్ చేయగా, నైట్ డ్యూటీ ఎస్ఐ ప్రసాద్ రెడ్డి, ఏఎస్ఐ అనిల్ గౌడ్ సిబ్బందితో కలిసి గంటన్నరలోనే నిందితులైన సయ్యద్ జుబేర్ అలీ (22), మహమ్మద్ పాషా (20)లను మొఘల్‌పురా రిలాక్స్ హోటల్ వద్ద అరెస్ట్ చేసి, ఆటోను సీజ్ చేశారు. నిందితుల నుంచి ఆటోతోపాటు 10 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
పాత నేరస్తుల పట్టివేత
న్యూ బోయిన్‌పల్లిలోని ఓ ఇంటి తాళాలు పగులగొట్టి 8 తులాల బంగారు నగలు, పంచలోహ విగ్రహం, 40 వేల నగదును దొంగలించిన ఇద్దరిని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. యాప్రాల్ బాపూజీనగర్ నివాసి అయిన భార్యాభర్తలు జే. చందన్ (39), లక్ష్మి అలియాస్ లచ్చి (35) తేలికగా డబ్బు సంపాదించేందుకు కలిసి దొంగతనాలు చేస్తున్నారు. సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
సూడో పోలీస్ అరెస్ట్
పోలీస్ అధికారిగా నటించి డబ్బు వసూలు చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అల్వాల్ నివాసి మల్లిక్, స్నేహితుడు సుఖంత్ కుమార్‌తో కలిసి న్యూ బోయిన్‌పల్లిలోని నేషనల్ పాయింట్ కేఫ్‌లో చాయ్ తాగి ఇంటికి వెళుతుండగా, పల్సర్ బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి వారిని ఆపాడు. తనను తాను పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని, వెనుక కూర్చున్న సుఖంత్ కుమార్ హెల్మెట్ ఎందుకు ధరించలేదని ప్రశ్నిస్తూ బైక్‌ను సీజ్ చేస్తానన్నాడు. వదిలి పెట్టాలంటే రూ.2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి డబ్బు వసూలు చేశాడు. ఫిర్యాదు అందగా, బోయిన్‌పల్లి పోలీసులు పోలీస్ అవతారమెత్తిన మసూద్ ఖాన్ (49)ను అరెస్ట్ చేశారు.
బీడీ అడిగి
బీడీ కావాలని అడిగి మొబైల్ ఫోన్‌ను దోచుకుని ఉడాయించిన ఇద్దరిని మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. పాన్ బజార్ నివాసి తన ఇంటి వద్ద ఉన్న ఆకాశ్ బేరింగ్ షాపు ముందు కూర్చొని బీడీ తాగుతుండగా, టూ వీలర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బీడీ ఇవ్వమని అడిగారు. బాధితుడు బీడీ ఇవ్వగానే వెనుక కూర్చున్న దుండగుడు అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కుని సహచరునితో కలిసి ఉడాయించాడు. కేసు నమోదు చేసిన మహంకాళి పోలీసులు నేరానికి పాల్పడ్డ షేక్ జావీద్ (33), షేక్ ఆరిఫ్ (25)లను అరెస్ట్ చేశారు.
