DCP Kavitha: వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట భయపెట్టి లక్షలకు లక్షలు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత (DCP Kavitha) ప్రజలను హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్‌ను ఎవరూ నమ్మవద్దని, ఏ దర్యాప్తు సంస్థ కూడా డిజిటల్ అరెస్ట్ చేయదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆమె స్పష్టం చేశారు. వేర్వేరు మార్గాల ద్వారా ప్రజల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు, గత కొన్ని రోజులుగా 60 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. ఫోన్లు చేస్తూ తమను తాము డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, సీబీఐ, ఈడీ అధికారులుగా పరిచయం చేసుకుంటున్నారు. అవతలి వారిని నమ్మించేందుకు సీనియర్ పోలీస్ అధికారులు ధరించే యూనిఫాంలు వేసుకుని మాట్లాడుతున్నారు.
Also Read: Kavitha on BRS: కవిత వ్యాఖ్యలు నిజమా?.. ఈ పరిణామాలు దేనికి సంకేతం..?
బెదిరింపులు ఇలా..
మీ పేరున వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ దొరికాయి’ అని కొన్నిసార్లు, ‘మనీ లాండరింగ్‌కు పాల్పడ్డట్టుగా ఆధారాలు లభ్యమయ్యాయి’ అని మరికొన్నిసార్లు చెబుతూ కేసులు నమోదు చేశామని బెదరగొడుతున్నారు. తాము ఫోన్ చేసిన విషయాన్ని ఎవ్వరికీ, చివరకు కుటుంబ సభ్యులతో కూడా చెప్పవద్దని, చెప్పితే జైలుకు పంపించడం ఖాయమంటూ నకిలీ నాన్-బెయిలబుల్ వారెంట్లు, కోర్టు ఆర్డర్ల కాపీలను వాట్సప్ ద్వారా పంపిస్తున్నారు. ఆ తర్వాత బాధితుల బ్యాంక్ ఖాతాల వివరాలు, వాటిల్లో ఎంత బ్యాలెన్స్ ఉందన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆ డబ్బును తాము చెప్పిన అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేయాలని, లేకపోతే చర్యలు తప్పవని బెదిరిస్తున్నారు. కొన్నిసార్లు బంగారాన్ని కుదువ పెట్టించి, ఫిక్స్‌డ్ డిపాజిట్లను విత్‌డ్రా చేయించి మరీ లక్షలకు లక్షలు తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకుంటున్నారు. ఈ సంవత్సరంలో ఇలాంటి నేరాలు దాదాపు 60 వరకు జరగడం గమనార్హం.
డీసీపీ హెచ్చరికలు
ఈ తరహా నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు డీసీపీ దార కవిత తెలిపారు. నిజమైన అధికారులు ఎవ్వరూ బ్యాంక్ ఖాతాలు, వాటిల్లో ఎంత డబ్బు ఉందంటూ వ్యక్తిగత సమాచారాన్ని అడగరని తెలిపారు. ఇలాంటి బెదిరింపు ఫోన్లకు భయపడి వ్యక్తిగత, సున్నిత సమాచారాన్ని పంచుకోవద్దని, కాల్స్‌ను వెంటనే కట్ చేసేయాలని సూచించారు. బెదిరింపులు వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930కి ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.inకు కూడా సమాచారం ఇవ్వొచ్చని కవిత సూచించారు.
Also Read: New Cyber Scam: రూటు మార్చిన సైబర్ కేటుగాళ్లు.. ఇలా కూడా మోసం చేస్తారా..!
