EPFO Passbook Lite: పీఎఫ్ మనీ విత్‌డ్రా చేసుకోవడంలో చందాదారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) గుడ్‌న్యూస్ చెప్పింది. చందాదారులకు మరిన్ని డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా, ‘పాస్‌బుక్ లైట్’ (EPFO Passbook Lite) అనే కొత్త ఫీచర్‌ను పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా పీఎఫ్ క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాదు, అధికారుల బాధ్యతను మరింత పెంచడం, చందాదారుల సంతృప్తిని మెరుగుపరచడం వంటివి ఈ ఫీచర్ లక్ష్యాలుగా ఉన్నాయి. ‘పాస్‌బుక్ లైట్’ ద్వారా ఈపీఎఫ్ అకౌంట్ నిర్వహణ మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా మారనుందని ఈపీఎఫ్‌వో అధికారులు చెబుతున్నారు. ఈపీఎఫ్‌వోకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విస్తృత సంస్కరణల్లో భాగంగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు.
ప్రత్యేకతలు ఇవే…
ప్రత్యేకమైన లాగిన్ అవసరం లేకుండానే, ఈపీఎఫ్‌వో మెంబర్ పోర్టల్ ద్వారా నేరుగా ‘పాస్‌బుక్ లైట్’ ఫీచర్ యాక్సెస్ అవుతుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక ఫీచర్‌లోని ముఖ్యాంశాల విషయానికి వస్తే, స్నాప్‌షాట్ వ్యూ (Snapshot View) ద్వారా మొత్తం కాంట్రిబ్యూషన్లు, విత్‌డ్రాయల్స్, ప్రస్తుత బ్యాలెన్స్‌ను ఒకే స్క్రీన్‌లో చూపిస్తుంది. ప్రత్యేక లాగిన్ అవసరం లేకుండానే, మెంబర్ పోర్టల్ నుంచే ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అంటే, తక్కువ సమయంలోనే ఖాతా వివరాలన్నీ చెక్ చేసుకోవచ్చు. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. బ్యాక్ ఎండ్‌లో పనిచేసే ఏపీఐలను (ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చేశారు. దీంతో, ప్రధాన పాస్‌బుక్ పోర్టల్‌పై లోడ్ తగ్గి, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ మెరుగవుతుంది.
Read Also- K-Ramp teaser: కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ టీజర్ వచ్చేసింది చూశారా.. ఎంటర్‌టైన్మెంట్ లోడింగ్..
ఉద్యోగులకు ప్రయోజనాలు ఏంటి?
ఈపీఎఫ్‌వో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఫీచర్ దేశవ్యాప్తంగా 27 కోట్లకు మందికిపైగా చందాదారులకు ఉపయుక్తంగా ఉండనుంది. పీఎఫ్ క్లెయిమ్స్, ట్రాన్స్‌ఫర్లు వేగంగా పూర్తికానున్నాయి. పేపర్‌వర్క్ తగ్గడంతో క్లెయిమ్ ప్రాసెసింగ్ తక్కువ టైమ్‌లోనే పూర్తవుతుంది. అంతేకాదు, పీఎఫ్ చందాదారులు తమ క్లెయిమ్, లేదా ట్రాన్స్‌ఫర్ స్టేటస్‌ను ప్రతి దశలోనూ ట్రాక్ చేసుకునే వీలుంటుంది. ఇదివరకు మాదిరిగా కాకుండా వెంటనే కీలకమైన డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. అనెక్సర్ (Annexure K, పాస్‌బుక్ సమరీ వంటివి మెంబర్ పోర్టల్ ద్వారా తేలికగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ సులభతరం కావడంతో సభ్యుల నమ్మకం పెరిగి, ఫిర్యాదులు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Oil Kumar: ప్రతిరోజూ 7 లీటర్ల ఇంజిన్ ఆయిల్ తాగుతున్నాడు.. ఇంతవరకు హాస్పిటల్ ముఖం చూడలేదు!
గతంలో చందాదారులు నేరుగా అనెక్సర్ కే డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలుండేది కాదు. ఈ డాక్యుమెంట్ ఈపీఎఫ్‌వో ఆఫీసుల మధ్యే షేర్ అవుతుండేది. దీని యాక్సెస్ కోసం చందాదారులు ప్రత్యేకంగా అభ్యర్థన పెట్టాల్సి వచ్చేది. ఇక, ఇకపై పాస్‌బుక్ లైట్ ఫీచర్ ద్వారా చందాదారులే నేరుగా అనెక్సర్ కే డాక్యుమెంట్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.