Health Vision 2047: తెలంగాణను దేశంలోనే మొట్టమొదటి తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarasimha) పిలుపునిచ్చారు. తలసేమియా అండ్ సికిల్‌సెల్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్(Hyderabad)లోని కమల హాస్పిటల్‌లో నిర్వహిస్తున్న ఏసియన్ తలసేమియా కాన్‌క్లేవ్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా, హీమోఫీలియా వంటి వ్యాధులు కేవలం వైద్యపరమైన నిర్ధారణలు మాత్రమే కావని, అవి బాధిత కుటుంబాలను జీవితకాలం వెంటాడే తీవ్రమైన సవాళ్లు అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రక్తసంబంధీకుల మధ్య వివాహాలు (మేనరికం) చేసుకోవడం వల్ల తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఈ జన్యుపరమైన వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉందని, దీనిని నివారించడానికి ముందస్తు స్క్రీనింగ్, కౌన్సిలింగ్, సామాజిక అవగాహన కల్పించడమే సరైన మార్గమని మంత్రి పేర్కొన్నారు.
త్వరలో మరో 3 సెంటర్లు
రాష్ట్ర ప్రభుత్వం తలసేమియా వ్యాధుల నియంత్రణకు, బాధితుల సంక్షేమానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆరోగ్యశ్రీ కింద బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. తలసేమియా, సికిల్‌సెల్ సొసైటీ సహకారంతో మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఇప్పటికే ప్రతి గర్భిణీకి విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. తలసేమియా బాధితులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో డే కేర్ సెంటర్లను నిర్వహిస్తున్నామని, త్వరలోనే ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌లలో అదనపు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని రాజనర్సింహ వెల్లడించారు.
Also Read: Meenakshi Chaudhary: నాకు హీరో ఎవరనేది ముఖ్యం కాదు.. అదే ముఖ్యం!
హెల్త్ విజన్ 2047
రాష్ట్రంలో సికిల్‌సెల్ వ్యాధిని గుర్తించేందుకు ఇప్పటివరకు 11 లక్షల మందికి పైగా స్క్రీనింగ్ పూర్తి చేశామని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు. నిమ్స్ హాస్పిటల్‌లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తెలంగాణ హెల్త్ విజన్ 2047లో భాగంగా అందరికీ అందుబాటులో మెరుగైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తున్నామని గుర్తుచేశారు. తలసేమియా, సికిల్‌సెల్, హిమోఫీలియా పేషెంట్లకు అవసరమైన అన్ని రకాల పరీక్షలను టీ-డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో ఉచితంగా చేయిస్తున్నామని, బాధితులకు మరిన్ని వైద్య సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బాధితులందరికీ సర్కారు పెన్షన్
నివారించగలిగే వ్యాధులతో ఏ చిన్నారి పుట్టకూడదని, అనారోగ్యం కారణంగా ఏ కుటుంబం పేదరికంలోకి వెళ్లకూడదన్నదే తమ ఆశయమని రాజనర్సింహ పేర్కొన్నారు. ప్రభుత్వం, వైద్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా పనిచేసి ‘మిషన్ తలసేమియా ఫ్రీ తెలంగాణ’ లక్ష్యాన్ని సాకారం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. దేశంలోనే తలసేమియా పేషెంట్లు లేని తొలి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుదామని మంత్రి ఆకాంక్షించారు. తలసేమియా, సికిల్ సెల్ పేషెంట్లు అందరికీ ప్రభుత్వం తరపున పెన్షన్ అందేలా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా దామోదర్ హామీ ఇచ్చారు.
Also Read: PSLV C62-EOS N1: పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ నింగిలోకి ఎగసిన తర్వాత క్రమరాహిత్యం.. ఏ ప్రకటనా చేయని ఇస్రో

