Khammam District: తెలంగాణలో నివాస యోగ్య నగరంగా ఖమ్మం ముందు వరుసలో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Thummala Nageswara Rao) అన్నారు. ఆదివారం ఖమ్మం నగరం 54వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్‌ను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రోడ్లను ఆక్రమించుకోవద్దని, పేదలకు గృహ వసతి కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రోడ్ల విస్తరణకు అందరూ సహకరించాలని కోరారు. విస్తరణతో తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా భవిష్యత్తులో వ్యాపారాలు మెరుగుపడతాయని, నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. జాతీయ రహదారుల అనుసంధానంతో రాబోయే రోజుల్లో రాజమండ్రికి గంటన్నర, హైదరాబాద్‌కు రెండున్నర గంటల్లో వెళ్లొచ్చని మంత్రి తెలిపారు. నగర జనాభా 5 లక్షలకు చేరిన నేపథ్యంలో తాగునీరు, డ్రెయిన్లు, రోడ్లను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తున్నామన్నారు.
Also Read: Huzurabad News: పల్లె ప్రకృతి వనంలో పొంచి ఉన్న మృత్యువు.. హైటెన్షన్ వైర్లతో అల్లుకున్న వనం..!
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
అనంతరం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ.. రూ. 93.70 లక్షల రూపాయలతో పార్క్ అభివృద్ధి చేశామని అన్నారు. అన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, నగరంలో మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు అన్నారు. నగరాన్ని పచ్చదనంతో, పరిశుభ్రంగా ఉంచేలే సహకరించాలని తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లలో ఫుట్ పాత్, పార్కుల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమంత రావు, స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, కార్పొరేటర్లు, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈ ధరణి కుమార్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: MPTC Elections: సార్ మాకు ఇంకోక అవకాశం ఇవ్వండి.. పీసీసీ చీఫ్‌కు వెల్లువెత్తుతున్న వినతులు..?

