Pakistan Condoms GST: ప్రపంచంలో అత్యధికంగా జనాభా పెరుగుతున్న దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. ఆ దేశ జనాభా నానాటికి పెరిగిపోతోంది. జనాభా వృద్ధికి తోడు అధిక ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న పాకిస్థాన్ కు గర్భ నిరోధక సాధానాలపై పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో తమ ఆర్థిక వ్యవస్థను నియంత్రిస్తున్న అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF)కి పాకిస్థాన్ ప్రభుత్వం కీలక విజ్ఞప్తి చేసింది. తమ దేశంలో కండోమ్ పై విధిస్తున్న పన్నును తగ్గించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఇందుకు ఐఎంఎఫ్ నిరాకరించినట్లు తెలుస్తోంది.
‘కండోమ్‌లు ఖరీదయ్యాయి’
పాకిస్థాన్‌కు చెందిన ది న్యూస్ పత్రిక కథనం ప్రకారం.. ప్రస్తుతం తమ దేశంలో కండోమ్ లపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని తగ్గించేందుకు అనుమతి ఇవ్వాలని షెహబాజ్ షరీఫ్ సర్కార్.. ఐఎంఎఫ్ ను కోరింది. ఈ మేరకు పాక్ కు చెందిన ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (FBR).. వాష్టింగ్టన్ లోని ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయానికి మెయిల్ పంపింది. 18 శాతం జీఎస్టీ విధించడం వల్ల దేశంలో కండోమ్ లు ఖరీదుగా మారాయని మెయిల్ లో తెలిపింది. కాబట్టి వాటిపై తక్షణమే జీఎస్టీ తగ్గించేందుకు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసింది. అయితే దీనిని ఐఎంఎఫ్ చాలా తీవ్రస్థాయిలో తిరస్కరించినట్లు పాక్ పత్రిక పేర్కొంది. కండోమ్ పై ట్యాక్స్ తగ్గించే అంశాన్ని వచ్చే బడ్జెట్ మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని పాక్ కు స్పష్టం చేసింది.
ఐఎంఎఫ్ అనుమతి ఎందుకు?
సాధారణంగా ఏ దేశంలోనైనా వస్తు సేవలపై విధించే పన్నుపై అక్కడి ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే కండోమ్ లపై పన్ను తగ్గించేందుకు పాకిస్థాన్.. ఐఎంఎఫ్ అనుమతి కోరడం వెనుక ఓ కారణం ఉంది. ఐఎంఎఫ్ నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున నిధులను పాక్ అప్పుగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఎంఎఫ్ తో పలుమార్లు బెయిలౌట్ ప్రోగ్రామ్ (Bailout Programme) కింద పాక్ ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ప్రకారం పాక్ లో విధించే పన్నులు, ఆదాయాలు, ఖర్చులపై ఐఎంఎఫ్ నియంత్రణ ఉంటుంది. ఆదాయ, వ్యయాలకు సంబంధించి పాక్ సర్కార్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అందుకు ఐఎంఎఫ్ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే కండోమ్ పై విధిస్తున్న ట్యాక్స్ ను తగ్గించుకునేందుకు అనుమతి ఇవ్వాలని పాక్.. ఐఎంఎఫ్ ను రిక్వెస్ట్ చేసింది.
శానిటరీ ప్యాడ్స్, డైపర్లు సైతం..
ఇదిలా ఉంటే పాక్ ప్రదిపాదించిన పన్ను రాయితీ వల్ల పాకిస్థాన్ ఆదాయంలో PKR (Pakistani Rupee) 400 మిలియన్ల నుంచి PKR 600 మిలియన్ల వరకూ కోత పడొచ్చని అంచనా. ఇది తమకు చెల్లించే వడ్డీలపై ప్రభావం చూపొచ్చని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. కాబట్టి ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్ను రాయితీలు ఇవ్వడం సాధ్యం కాదని ఐఎంఎఫ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. అలాగే శానిటరీ ప్యాడ్లు, చిన్నారుల డైపర్లపై GST తగ్గించాలన్న ప్రతిపాదనను సైతం IMF తిరస్కరించిందని ఓ నివేదిక తెలిపింది. దీన్ని బట్టి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను ఐఎంఎఫ్ ఏ స్థాయిలో నియంత్రిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Supreme Court: సుప్రీం కోర్టులో తెలంగాణకు భారీ ఊరట.. రూ.15వేల కోట్ల విలువైన భూమిపై తీర్పు!
జనాభాలో ఏటా 2.55 శాతం వృద్ధి
ప్రస్తుతం పాకిస్తాన్ జనాభా వృద్ధి రేటు 2.55%గా ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక జనాభా వృద్ధి రేట్లలో ఒకటి. పాకిస్థాన్ లో ప్రతీ ఏటా 6 మిలియన్ల మంది ప్రజలు కొత్తగా జనాభాలో చేరుతున్నారు. అసలే అప్పులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ పై ఇది మరింత భారాన్ని మోపుతోంది. ఇటీవల ఐఎంఎఫ్ తో 7 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ఒప్పందాన్ని పాక్ కుదుర్చుకుంది. దీని ద్వారా మరో 11 అదనపు షరతులు పాకిస్థాన్ పై విధించబడ్డాయి. ఫలితంగా గత 18 నెలల్లో ఐఎంఎఫ్ విధించిన మెుత్తం షరతుల సంఖ్య 64కి చేరింది.

