Supreme Court: తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కీలక విజయాన్ని సాధించింది. సాహెబ్‌నగర్ కలాన్ గ్రామ పరిధిలోని గుర్రంగూడలోని రూ.15వేల కోట్ల విలువ చేసే అటవీ భూములు అటవీ శాఖకు చెందినవే అని గురువారం అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ క్రమంలో గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట దక్కినట్టయ్యింది. గుర్రంగూడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 201/1లో 102 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. కాగా, ఈ భూమిపై హక్కులు తమవే అంటూ నిజాం, సలార్‌జంగ్ వారసులు రెండు వందల అరవై మంది హై కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
భూములను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత
వీటిపై విచారణ జరిపిన హైకోర్టు వారి పక్షాన తీర్పు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. నిజానికి ఆ భూములు అటవీ శాఖవని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై సుధీర్ఘ విచారణ జరిపిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం గురువారం ఆ భూములు అటవీ శాఖకు చెందినవే అని పేర్కొంటూ తీర్పును వెలువరించింది. నోటిఫై చేసిన అటవీ భూములపై చాలా ఆలస్యంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులు హక్కులు తమవే అని వేసిన దావాలు చట్టబద్దంగా లేవని స్పష్టం చేసింది. అటవీ భూములు జాతీయ సంపద అని గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 48ఏ, 51ఏ(జీ) ప్రకారం అటవీ భూములను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది.
Also Read: Supreme Court: సుప్రీం తీర్పుపై ఉత్కంఠ.. నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ..!
రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలి
అటవీ శాఖ తీసుకున్న చర్యలు అటవీ చట్టానికి, పర్యావరణ పరిరక్షణ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు కల్పించింది. తీర్పు వెలువడిన ఎనిమిది వారాల్లోపు 102 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. నోటిఫికేషన్ కాపీని సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి పంపించాలని సూచించింది. ఈ తీర్పుతో దాదాపు ఇరవయ్యేళ్లుగా కొనసాగుతున్న భూ వివాదానికి పరిష్కారం లభించినట్టయ్యింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్థవంతంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సీ.ఎస్. వైద్యనాథన్, రిటైర్డ్ జస్టిస్ చల్ల కోదండరాం, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ శ్రావణ్ కుమార్‌కు అటవీశాఖ కృతజ్ఞతలు తెలిపింది. జిల్లా, డివిజనల్, రేంజ్ అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అనేక ఏళ్లుగా చేసిన నిరంతర కృషి వల్లే ఈ తీర్పు సాధ్యమైందని రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌వో రోహిత్ గోపిడి అన్నారు.
Also Read: Supreme Court: సుప్రీంకోర్టులో రిజర్వేషన్లకు అనుకూలంగా మరో 4 పిటిషన్లు?

