Telangana Education: విద్యారంగం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వద్ద ఈ శాఖ ఉండటంతో ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనేపథ్యంలోనే రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయా(KGBV)ల ఆధునీకరణకు సర్కార్ శ్రీకారం చుట్టనుంది. 475 కేజీబీవీల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకుంది. నాబార్డ్ అందించిన రూ.243 కోట్లతో ఈ పనులు చేపట్టనుంది. తెలంగాణలోని 31 జిల్లాలకు చెందిన కేజీబీవీల్లో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. ఏ కేజీబీవీలో ఏ అవసరముంది అనే అంశంపై ఇప్పటికే అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. దానికి అనుగుణంగా అవసరాన్ని బట్టి వసతులు కల్పించనున్నారు. దీనికి సంబంధించి పనుల ఎస్టిమేషన్ ను సైతం పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరంలోపు ఈ పనులు పూర్తిచేపట్టి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని విద్యాశాఖ భావిస్తోంది.
మౌలిక సదుపాయాల కల్పన
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ఆధునీకరణలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, కొత్త గదులు నిర్మించడం, బాత్రూంల నిర్మాణం, ఉన్న వాటిని ఆధునీకరించడం, సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి. సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు కూడా ఈ అభివృద్ధి పనులు దోహదపడనున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పాఠశాలల్లో అదనపు గదులు నిర్మించడం, విద్యార్థినులకు తగినన్ని బాత్‌రూమ్‌లు ఏర్పాటు చేయడం వంటివి ఈ ఆధునీకరణలో ముఖ్యమైనవి. అలాగే విద్యాభివృద్ధికి గాను సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీలను ఆధునీకరించడం, మెరుగుపరచడం, కంప్యూటర్లు వంటి కొత్త పరికరాలు అందించడం వంటి పనులు కూడా చేపట్టనున్నారు.
Also Read: JNTU Nachupally Ragging: నాచుపల్లి జేఎన్టీయూలో.. కోరలు తెరిచిన ర్యాగింగ్ భూతం!
ఏమేం కావాలో ఎస్టిమేషన్..
కేజీబీవీల్లో అవసరమైన చోట్ల తరగతి గదుల నిర్మాణంతో పాటు కాంపౌండ్ వాల్స్, బోరు సదుపాయం, మంచినీరు, సంపుల నిర్మాణాన్ని సైతం చేపట్టనున్నారు. కాగా ఈ పనులకు టెండర్లను పిలవకముందే అవసరాలను గుర్తించి ఏమేం కావాలో ఎస్టిమేషన్ ను పూర్తిగా అందించాలని విద్యాశాఖ ఆదేశించింది. త్వరలోనే ఈ పనులకు టెండర్ ను పిలవాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ ప్రొక్యూర్ మెంట్ ప్లాట్ ఫాం(Procurement Platform) ద్వారా టెండర్ పనుల ప్రక్రియ కొనసాగనుంది. క్వాలిటీతో, అన్ని సేఫ్టీలు పాటించి అనుకున్న సమయానికి పనులు పూర్తిచేయాలని విద్యాశాఖ భావిస్తోంది. 2026-27 విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమవ్వకముందే ఈ పనులు పూర్తిచేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. రూ.243 కోట్లతో 475 కేజీబీవీల్లో అభివృద్ధి పనులకు ఆయా జిల్లాల వారీగా నిధులు సైతం మంజూరుచేసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే దాదాపు 93 కేజీబీవీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలుగా తీర్చిదిద్ది ఇతర కేజీబీవీలను కూడా అలాగే తీర్చిదిద్దే యోచనలో విద్యాశాఖ ఉంది. ఈ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అయినా విద్యారంగంలో ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: Karimnagar: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. 25 మందికి అస్వస్థత.
