Naa Anveshana: ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. హిందూ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలు భారత్ లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి కరాటే కళ్యాణి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరికొందరు సైతం నా అన్వేష్ ను అరెస్ట్ చేయాలంటూ ఫిర్యాదులు చేశారు. అయితే తాజాగా ప్రముఖ రాజకీయ పార్టీ సైతం నా అన్వేష్ పై యుద్ధం ప్రకటించింది. బీజేపీ పార్టీ ఓబీసీ మోర్చా తరపున ఫిర్యాదు అందడంతో హైదరాబాద్ లో కొత్తగా మరో కేసు నమోదైంది.
అన్వేష్‌పై దేశ ద్రోహం కేసు..
హిందూ దేవతలను కించపరిచేలా నా అన్వేష్ మాట్లాడారంటూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగంటి రాజు.. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రాము, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సైతం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అన్వేష్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు పోలీసులను కోరారు. విదేశాల్లో ఉన్న అన్వేష్ ను పట్టుకొచ్చి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఇప్పటివరకూ వ్యక్తిగతంగా పలువురు అన్వేష్ పై ఫిర్యాదు చేస్తుండగా.. తాజాగా బీజేపీ పార్టీ తరపున ఒకరు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తిరేపుతోంది.
యూట్యూబర్ అన్వేష్‌పై మరో కేసు
హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన అన్వేష్‌పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఈ మేరకు అన్వేష్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
ఫిర్యాదు చేసినవారిలో బీజేపీ ఓబీసీ… pic.twitter.com/RpHpil1Rhs
— BIG TV Breaking News (@bigtvtelugu) January 3, 2026
త్వరలో నోటీసులు..
సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదుతో హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసు స్టేషన్ లోనూ అన్వేష్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన అక్కడి పోలీసులు.. త్వరలోనే అతడికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అన్వేష్ పోస్ట్ చేసిన వివాదస్పద వీడియోలకు సంబంధించి ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాశారు. నా అన్వేష్ ఉపయోగిస్తున్న ఐడీ వివరాలు ఇవ్వాలని కోరారు. ఇన్ స్టాగ్రామ్ నుంచి రిప్లై వచ్చిన అనంతరం దేశ ద్రోహం ఆరోపణలకు సంబంధించి అన్వేష్ కు నోటీసులు జారీ చేయాలని పంజాగుట్ట పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా హిందూ దేవతలను కించపరుస్తూ భారత సంస్కృతి సంప్రదాయాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న అన్వేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నటి కరాటే కళ్యాణి ఫిర్యాదులో డిమాండ్ చేశారు.
అన్వేష్ రియాక్షన్
సీతాదేవి, ద్రౌపదిలపై తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం, లక్షల మంది అన్ సబ్ స్రైబ్ చేస్తుండడం, పంజాగుట్ట పోలీసులు ఇన్‌స్టా కు లేఖ రాయడంపై అన్వేష్ స్పందించాడు. దేవుడి మీద ఒట్టు ఇకపై బూతులు మాట్లాడను అని చెప్పాడు. తన కలలో హనుమంతుడు కనిపించి చెప్పాడని అంటూ ఇకపై ప్రజా సమస్యలపైనే వీడియోలు చేస్తానన్నాడు. మహిళలకు అండగా ఉంటూ ధర్మం నాలుగు పాదాల మీద నడిచేటట్టు చూస్తానని చెప్పాడు. కొత్త సంవత్సరంలో తన వీడియోలన్నీ ప్రజా సమస్యలపైనే ఉంటాయని తెలిపాడు.
Also Read: Hyberabad Police: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? మీ ఇల్లు గుల్ల కావొచ్చు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!
అసలేంటి వివాదం?
హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ, అనసూయ మధ్య జరుగుతున్న వివాదంలోకి నా అన్వేష్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చాడు. శివాజీ వివాదంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలను చూపిస్తూ.. ఘాటు వ్యాఖ్యలు చేశాడు. వాటిలో కోట్లాది మంది పూజించే సీతమ్మ వారితోపాటు ద్రౌపదిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. అదే సమయంలో దేశ ప్రతిష్టను దెబ్బ తీసేలా మాట్లాడాడు. దీంతో నటి కళ్యాణితో పాటు విశ్వహిందూ పరిషత్, పలువురు వ్యక్తులు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

